రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు..దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం ఆదివారం దావోస్ బయల్దేరి వెళ్లనుంది.
By - Knakam Karthik |
రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు..దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు
అమరావతి: వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం ఆదివారం దావోస్ బయల్దేరి వెళ్లనుంది. 4 రోజుల పాటు దావోస్‌లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ముఖాముఖి భేటీలు, కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్న సీఎం..అక్కడి నుంచి జ్యూరిచ్‌కు వెళ్తారు. ఢిల్లీలో 19 తేదీన రాత్రి 01.45 గంటలకు బయల్దేరి ఉదయం జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్విట్జర్లాండ్ భారతీయ రాయబారి మృదుల్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.
అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ కిషోర్ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లు కూడా ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. మొత్తం 20 దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్‌టీలతో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
అనంతరం సీఎం చంద్రబాబు జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్ వెళ్తారు. దావోస్‌లో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్ధిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో వివిధ దేశాల మధ్య జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం టాటాసన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా దావోస్ వేదికగా సీఎంతో సమావేశం అవుతారు. విదేశీ మీడియా సంస్థ పొలిటికోకు ముఖ్యమంత్రి ప్రత్యేక ఇంటర్యూ ఇవ్వనున్నారు.