ఏపీలో పరిశోధనలు చేయండి -పెట్టుబడులు పెట్టండి
హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
By Medi Samrat
హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ పై పరిశోధనలు చేయాలని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించారు. గ్రీన్ హైడ్రోజన్ ను తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి చేసేలా కొత్త సాంకేతికను అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈమేరకు యూనివర్సిటీలు, పరిశోధకులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ అంశంపై సీఎం మాట్లాడుతూ.." గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగింది. పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగాలి. 2070 నాటికి కర్బన రహిత ఇంధనాలు వాడాలన్నది మన జాతీయ లక్ష్యం.తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజ్‍పై దృష్టి సారించాలి. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్ పరిశోధన, ఉత్పత్తికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకునేందుకు ఏపీ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇంధన ఖర్చు తగ్గాలి ప్రజలకు ప్రయోజనం చేకూరాలన్నదే ముఖ్యం. గ్రీన్ హైడ్రోజన్‍తో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఇవ్వడం సాధ్యం. 2030 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ తయారీ లక్ష్యంగా ప్రధాని నిర్ణయించారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీ లక్ష్యంలో ఏపీ ప్రముఖ భాగస్వామిగా ఉంటుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గ్రీన్ హైడ్రోజన్..గేమ్ ఛేంజర్
ఇంధన రంగంలో ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా పరిశోధనలు చేసి పరిష్కారం అన్వేషించాలని పరిశోధకులకు సీఎం పిలుపునిచ్చారు. సంప్రదాయ ఇంధన వనరుల కారణంగా తీవ్రమైన కాలుష్యం బారిన పడుతున్నామని నెట్ జీరో కార్బన్ లక్ష్యాల సాధనకు గ్రీన్ హైడ్రోజన్ లాంటి ఇంధనమే సరైన పరిష్కారమని సీఎం అన్నారు. ఇక సమీప భవిష్యత్ అంతా గ్రీన్ హైడ్రోజన్ దేనని.. ఇంధన రంగంలో అది గేమ్ ఛేంజర్ గా మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే తక్కువ ఖర్చుతో సామాన్యులు కూడా వ్యయం భరించేలా ఉండే దీనిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఏపీలోనూ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. విశాఖలో ఎన్టీపీసీ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసేందుకు ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోందని అన్నారు. అలాగే కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. 160 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని ఏపీ నిర్దేశించుకుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3 గిగావాట్ల సామర్ధ్యంతో ఎలక్ట్రోలైజర్ల ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తితో పాటు ఏపీలో సౌర, పవన, పంప్డ్ విద్యుత్ ఉత్పత్తికి అపారమైన వనరులు ఉన్నాయని స్పష్టం చేశారు. అమరావతిలో కృత్రిమ మేథ కేంద్రంగా క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని.. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా నూ తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అన్నారు. రెండు రోజుల సదస్సు అనంతరం అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ను ప్రకటిస్తామని.. ఏడాది తర్వాత డిక్లరేషన్ అమలు పై సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు.
గ్రీన్ హైడ్రోజన్ , గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి సీఎం సమక్షంలో రూ.51 వేల కోట్లకు ఒప్పందాలు
ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ , గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసేందుకు రెండు సంస్థలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సదస్సు వేదికగా ట్రాన్సఫర్మేటివ్ అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం- ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. యూకేకు చెందిన యమ్నా సంస్థ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఏడాదికి 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాట్ ను ఏర్పాటు చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. అలాగే కేఎస్ఎహెచ్ ఇన్ప్రా సంస్థ మచిలీపట్నంలో 150 కిలోటన్నుల సామర్ధ్యంతో గ్రీన్ హైడ్రోజన్ , 600 కిలోటన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాట్లను ఏర్పాటు చేయనుంది. దీనికోసం రూ.35 వేల కోట్ల రూపాయల్ని పెట్టుబడి పెట్టనుంది. అంతకుముందు సదస్సులో భాగంగా ఇంధన రంగానికి చెందిన వివిధ సంస్థల సీఈఓలు, ఎండీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సదస్సుకు నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు.