పీ4 లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పీ4 విధానంపై కీలక అడుగులు పడ్డాయి
By Medi Samrat
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పీ4 విధానంపై కీలక అడుగులు పడ్డాయి. స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగింది. రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన ఈ జనరల్ బాడీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పీ-4 పథకం సమర్థవంతంగా అమలుకు రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటీవ్ కమిటీ, అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే జిల్లా, నియోజకవర్గం స్థాయిలో పీ4 ఛాప్టర్లు ఏర్పాటుకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయా కమిటీల్లో స్పర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ సహా ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. పీ4 స్ఫూర్తిని చాటేలా రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
పీ4 స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
“పేదల బతుకుల్లో వెలుగును నింపేలా పీ4 విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. పీ4 స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. పేదలు, ధనికుల మధ్య అంతరాలు తగ్గించేలా పీ4 విధానం అమలు చేస్తున్నాం. గతంలో జన్మభూమి అని పిలుపు ఇస్తే మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు పీ4 అంటున్నాం.. మంచి స్పందన వస్తోంది. ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను, లక్ష మంది మార్గదర్శులను గుర్తించేలా లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలి. ఇక పీ4 బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే మార్గదర్శులు పాత్రపై మరింత క్లారిటీకి రావాలి. బంగారు కుటుంబాలు అన్ని అంశాల్లో సాధికారత సాధించేలా.. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా మార్గదర్శులు గైడ్ చేస్తూ ఉండాలి. అవసరమైన సమయంలో సాయంతోపాటు.. నిరంతర మార్గనిర్దేశనం చేసేలా మార్గదర్శులు ఉండాలి. కొందరు మార్గదర్శులు.. ఒక్కసారి ఆర్థిక సాయం చేస్తే సరిపోతుందేమోనని భావిస్తున్నారు. ఇలాంటి వారి సాయాన్ని పీ4 వేదికగా పేదలకు అందించేందుకు ప్రభుత్వం సిద్దమే. కానీ దత్తత తీసుకున్న పేద కుటుంబాలకు నిరంతరం గైడెన్స్ ఇచ్చే మార్గదర్శులను గుర్తించండి. వివిధ నియోజకవర్గాల పరిధిలో ఉండే ఎన్ఆర్ఐలు.. వివిధ పరిశ్రమలు.. ధనవంతులు ఎవరో గమనించాలి. వివిధ రూపాల్లో పేదలకు సేవలు అందించే వారిని గుర్తించండి. ఇలాంటి వారిని పీ4 వేదిక మీదకు తీసుకురావాలి.” అని ముఖ్యమంత్రి చెప్పారు.
సంకల్పం తీసుకుందాం... పేదరికం లేని సమాజం స్థాపిద్దాం..
“పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా పని చేయాలి. పీ4 విధానం ద్వారా రాష్ట్రంలో 2029 నాటికి పేదరికాన్ని రూపుమాపాలి. ఇలా చేయాలంటే మామూలు విషయం కాదు. పేదరికంపై యుద్దం చేయాలి.. అప్పుడే చరిత్ర సృష్టించగలం. దీనికి సంకల్పం తీసుకోవాలి. సంకల్పం తీసుకుంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు. మారుతున్న పరిణామాలను గమనించాలి. ఒకప్పుడు పీపీపీ మోడల్ అన్నాం. ఇప్పుడు వీజీఎఫ్ అనే కొత్త విధానం వచ్చింది. వీటిని అందిపుచ్చుకుంటే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అదే విధంగా గతంలో జన్మభూమి ద్వారా సమాజానికి సేవ చేయాలనే విధానాన్ని అందిపుచ్చుకున్నాం. గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున ఆస్తులను సృష్టించుకున్నాం. ఇప్పుడు పీ4 విధానం ద్వారా పేదలకు సాయం చేస్తూ.. ఆర్థిక అసమానతలు తగ్గించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన టాప్ 10 శాతం మంది.. అట్టడుగున పేదరికంలో ఉన్న 20 శాతం మందితో అనుసంధానం చేసే విధానమిది. సమాజంలోని వనరులను ఉపయోగించి పైకి ఎదిగిన వారు.. ఇప్పుడు గివ్ బ్యాక్ పాలసీపై ఫోకస్ పెడుతున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్, వేదాంత, జీఎమ్మార్ వంటి సంస్థలే దీనికి ఉదాహరణ.” అని చంద్రబాబు వివరించారు.
సంక్షేమానికి అదనంగా పీ4
“బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ఎలాంటి కోత ఉండదు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పాను. ఇప్పుడూ మళ్లీ చెబుతున్నాను. సంక్షేమ పథకాలకు.. పీ4కు లింకు ఉండదని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే.. బంగారు కుటుంబాలకు ఆర్థిక చేయూత అందుతుంది. సంక్షేమం అందిస్తే పేదరికం పోదు. ఇలా అయితే.. 75 ఏళ్లుగా ఎంతో ఖర్చు పెడుతున్నాం.. కానీ పేదరికం తొలగిపోవడం లేదు.. పేదల ఆర్థిక ఎదుగుదలకు సరైన సమయంలో సరైన గైడెన్స్ అవసరం.. చాలా మంది చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే.. వారి వారి రంగాల్లో రాణించారు. పేదలకు ఓ గైడింగ్ ఫోర్స్ ఉండేందుకే పీ4 విధానాన్ని అమలు చేస్తున్నాం. బంగారు కుటుంబాల్లోని యువత, విద్యార్థుల కెరీర్ ను సెటిల్ చేసేలా మార్గదర్శులు చూడాలి. ఎన్నో ఆలోచనలు ఉన్నా.. పేదరికం కారణంగా చాలా మంది ఏం చేయలేకపోతున్నారు. బంగారు కుటుంబాల్లోని వ్యక్తుల ఆశలు.. ఆశయాలకు ఆలంబనగా మార్గదర్శులు నిలవాలి. ప్రభుత్వం ఇఛ్చే దానికి అదనంగా మార్గదర్శకులు సహకరించాలి. ప్రజలే ఆస్తిగా పరిగణించాలి. మార్గదర్శుల ఎంపిక కోసం.. పేదలకు సాయం చేయాలని కోరుతూ నేను చాలా మందితో మాట్లాడాను. చాలా మంది మోటివేట్ అవుతున్నారు. పేదలకు సాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ప్రజల్లోకి వెళ్లడానికి... మంచి పేరు తెచ్చుకోవడానికి వేదిక పీ4
“మంచి పేరు తెచ్చుకుంటే కిక్ వస్తుంది. మంచి పేరు కోసం పేదలకు సేవ చేసే వారు ఉన్నారు.. ఆర్థికంగా సాయం చేసే వారున్నారు. వీళ్లని గుర్తించాలి. అలాగే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రజా ప్రతినిధులకూ పీ4 అద్భుతమైన వేదిక. ప్రతి నియోజకవర్గంలోనూ 6-10 వేల పేద కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఎంపిక కానున్నాయి. ఎమ్మెల్యేలకు ఇంతకు మించిన పెద్ద అవకాశం ఉండదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నమ్ముకున్న నియోజకవర్గానికి న్యాయం చేయడానికి ఈ స్కీంను వినియోగించుకోవచ్చు. పీ4 అమలు విషయంలో అందరి మధ్య పోటీ రావాలి. ఎమ్మెల్యేల మధ్య పోటీ.. అధికారుల మధ్య పోటీ ఉంటుంది. స్థానికంగా ఏయే నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఉంటే.. వారు ఆయా నియోజకవర్గాల్లోని బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకునే విధానాన్ని అమలు చేస్తాం. ఇక పరిశ్రమలు లేని నియోజకవర్గాలు.. ధనవంతులు పెద్దగా ఉండని ఏజెన్సీ ఏరియాల్లోని బంగారు కుటుంబాలకు మార్గదర్శకులను అటాచ్ చేసే అంశంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. సమాజం కోసం అందర్నీ భాగస్వాములను చేయాలి. ఇక అధికారులు కూడా బంగారు కుటుంబాలు, మార్గదర్శుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. రియల్ టైమ్ నుంచి డేటాను తీసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డు ఉంటుంది.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
పీ4 లోగోకు ఆమోదం
పీ4 స్ఫూర్తిని చాటేలా రూపొందించిన ఆరు రకాల లోగోలను అధికారులు సీఎం ముందు ఉంచారు. అందరి అభిప్రాయం తీసుకున్న అనంతరం పీ4 లోగోను సీఎం ఆమోదించారు. పీ4 లోగో కూడా ఫైనల్ చేశాం కాబట్టి.. దీన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పీ4 విధానం పైనా.. దీని వల్ల కలిగే లాభాల పైనా.. పీ4 ద్వారా లబ్ది పొందిన వారి కేస్ స్టడీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే పేదలకు సేవలందించడానికి ముందుకు వచ్చిన మార్గదర్శులకు సముచిత రీతిలో గౌరవం ఇవ్వాలని సీఎం చెప్పారు. పీ4 అమల్లో బాపట్ల జిల్లా అగ్రభాగంలో ఉందని.. దీనికి కృషి చేసిన ఆ జిల్లా ప్రజా ప్రతినిధులకు, జిల్లా కలెక్టరుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. పీ4 విధానం ద్వారా ముఖ్యమంత్రి అద్భుత కార్యక్రమాన్ని చేపడుతున్నారని.. దీనికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. అలాగే పీ4 విధానం అమలు విషయంలో ఉన్న కొన్ని సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.