లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మూడో రోజు విచారణ నిమిత్తం సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, జైలు నుంచి ఆయన్ను విచారణకు తరలిస్తున్న సమయంలో ఆయన గట్టిగా కేకలు వేశారు. "నేను ఏ తప్పు చేయలేదు, నాపై తప్పుడు కేసులు పెట్టారు" అంటూ చెవిరెడ్డి గట్టిగా అరిచారు. తప్పుడు కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. తప్పుడు కేసులు పెట్టిన వారు ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తారు అని చెవిరెడ్డి అన్నారు.
లిక్కర్ కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో వారిని జైలు నుంచి బయటకు తీసుకువస్తుండగా, చెవిరెడ్డి ఒక్కసారిగా తాను నిర్దోషినంటూ నినాదాలు చేశారు.