చంద్రబాబు అనంతపురం పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 30 July 2024 9:00 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురంలో పర్యటించనున్నారు. ఆగస్టు 1న ఆయన అనంతపురం పర్యటన ఖరారు అయింది. ఆరోజు తన పర్యటనలో భాగంగా ఏపీ సీఎం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణా నదికి జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం శ్రీశైలం డ్యామ్ కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని సందర్శించనున్నారు. శ్రీశైలంలో పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లాకు రానున్నారు. గుండుమల గ్రామంలో చంద్రబాబు పెన్షన్ల పంపిణీని స్వయంగా పర్యవేక్షించనున్నారు.
ఆగస్టు 1వ తేదీన ఉదయం 6గం.లకే ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు 1వ తేదీనే 96శాతం పైగా ఫించన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది 1వ తేదీ ఇంటింటా వెళ్ళి 96 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని, 2వతేదీన నూరు శాతం ఫించన్ల పంపిణీనీ పూర్తి చేయాలన్నారు. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు స్వయంగా పాల్గొనాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.