'మేం పాలకులం కాదు.. ప్రజల సేవకులం'.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంపై ప్రజలకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
By అంజి Published on 5 Jun 2024 5:33 AM GMT'మేం పాలకులం కాదు.. ప్రజల సేవకులం'.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంపై ప్రజలకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఉన్నత భవిష్యత్ కోసం పని చేస్తామన్నారు. తన సుధీర్ఘ రాజకీయ యాత్రలో గడిచిన ఐదేళ్ల లాంటి పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేశారో చూశామన్నారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజమని, ఎవరూ శాశ్వతం కాదని అన్నారు. దేశం శ్వాశతమని.. రాజకీయాలు అశాశ్వాతమని అన్నారు. ప్రజల గెలవాలి.. రాష్ట్రం నిలబడాలన్నదే తన ధ్యేయమని చంద్రబాబు పేర్కొన్నారు.
మరింత బాధ్యతతో మనమంతా కలిసి పని చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. తాము పాలకులం కాదని.. ప్రజల సేవకులమని అన్నారు. తమ ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 45.6 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. వైసీపీకి 39.35 శాతం ఓట్లు పోల్ అయ్యాయని తెలిపారు. సక్రమంగా పని చేస్తేనే మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు. ఇంత చారిత్రాత్మక ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు.. అమెరికాలో ఉన్నవారు కూడా తపనతో వచ్చి ఓటు వేశారని తెలిపారు.
పక్క రాష్ట్రాలకు కూలి పనుల కోసం వెళ్లిన వారు కూడా రాష్ట్రం బాగుపడాలని వచ్చి ఓటు వేశారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లే ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ఐదేళ్లు తమ కార్యకర్తలకు నిద్ర లేకుండా చేశారని, అహంకారులైన పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. స్వేచ్ఛను హరించడం వల్ల వచ్చిన ఈ ఫలితం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది అని అన్నారు.