రచ్చకెక్కిన రాజకీయం.. చంద్రబాబు 36 గంటల దీక్ష..!
Chandrababu to stage deeksha against ycp attacks. పార్టీ ఆఫీసులపై దాడులతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ, టీడీపీ నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
By అంజి Published on 20 Oct 2021 9:19 AM GMTపార్టీ ఆఫీసులపై దాడులతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ, టీడీపీ నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. పోటాపోటీగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ నాయకుల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులకు నిరసనగా 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు టీడీపీ ప్రకటన రిలీజ్ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలతో చర్చించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పెట్రేగిపోతోందని చంద్రబాబు అన్నారు. ఫ్యాక్షనిజానికి అధికారం తోడయ్యిందని అన్న ఆయన.. దీనిలో పోలీసుల అంతర్భాగమయ్యారని అన్నారు. ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద దాడులకు సీఎం జగన్ తెరతీశారని, ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజమని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. ముందస్తు కుట్రలో భాగంగానే టీడీపీ నేతలు ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేశారని, కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికిపోయేలా దాడులకు తెగబడ్డారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడి జరిగిన రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజని చంద్రబాబు అన్నారు. దీని వెనుక డీజీపీ ప్రోద్భలం ఉందని చంద్రబాబు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ పాటుపడుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ దమనకాండను నిలువరించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. ప్రభుత్వంపై పోరుకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, పౌరసంఘాలు, ప్రతిపక్షాలు కలిసి ముందుకు రావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.