టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ ను ప్రకటించేనా.?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మరోసారి పుంజుకుంటుందా అనే ఆశలు ఇటీవలే చిగురించాయి.
By Medi Samrat Published on 5 July 2024 3:15 PM GMTతెలంగాణలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మరోసారి పుంజుకుంటుందా అనే ఆశలు ఇటీవలే చిగురించాయి. ఏపీలో టీడీపీ అఖండ విజయం సాధించడంతో తెలంగాణలో ఉన్న టీడీపీ కార్యకర్తల్లో కొత్త జోష్ మొదలైంది. శుక్రవారం సాయంత్రం అధికారిక కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్‌కు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తూ ఉన్నారు. జులై 7 ఆదివారం నాడు టీడీపీ తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు. కొత్తగా అధ్యక్షుడిని ఏర్పాటు చేసే అంశంపై ఆయన చర్చించే అవకాశం ఉంది.
గత తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో టీడీపీ పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించుకున్న తర్వాత గత అక్టోబర్‌లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్నారు. దీంతో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీడీపీ పెద్దగా సత్తా చూపకపోవడంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్‌కు వస్తారని, జూలై 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తారని, విభజన సమస్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇక ఆదివారం ఆయన తెలంగాణ నేతలతో సమావేశమై పార్టీ భవిష్యత్తు గురించి చర్చించనున్నారు.