ఉద్యోగాలిచ్చేలా ఎన్నార్టీలు ఎదగాలి.. జ్యూరిచ్ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

By -  Medi Samrat
Published on : 19 Jan 2026 9:41 PM IST

ఉద్యోగాలిచ్చేలా ఎన్నార్టీలు ఎదగాలి.. జ్యూరిచ్ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని సీఎం ఆకాంక్షించారు. వినూత్న రీతిలో ఆలోచన చేస్తే... ఉద్యోగాలు చేసే ఎన్నార్టీలు పారిశ్రామిక వేత్తలుగా మారడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. దావోస్ తొలి రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”దావోస్ కు నేను తొలిసారి వచ్చినప్పుడు భారతీయులు తక్కువగా ఉన్నారు... తెలుగు వాళ్లు అసలు లేరు. ప్రస్తుతం ఉన్నది విజయవాడలోనా.. తిరుపతిలోనా అనేలా జ్యూరిచ్ లో పరిస్థితి ఉంది. 20 దేశాల నుంచి తెలుగు వారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారు...148 దేశాల్లో ఎన్నార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. విదేశాల్లో ఉన్నా తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. విజన్ 2020, ఐటీ గురించి నేను మాట్లాడిన రోజుల్లో అందరూ విమర్శించారు. కానీ నేను ఆనాడు తీసుకున్న నిర్ణయం వల్ల 195 దేశాలకు తెలుగు వారు వెళ్లడానికి అవకాశం కల్పించింది. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడం గర్వకారణం. 2047కు భారత దేశం ప్రపంచంలో నెంబర్ ఎకానమీ దేశంగా అవతరిస్తుంది. భారత దేశానికి అత్యంత బలమైన నాయకత్వం నరేంద్ర మోదీ రూపంలో ఉంది. ఉన్నత విద్యను అభ్యసించిన వారిని... యువకులను పార్టీలో, ప్రభుత్వంలో ప్రోత్సహిస్తున్నాం. అందుకే లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి వారికి పదవులు దక్కాయి. రామ్మోహన్ నాయుడు కేంద్రంలో యువ కెబినెట్ మంత్రి.”అని ముఖ్యమంత్రి అన్నారు.

ఎన్నికల్లో ఎన్నార్టీల సహకారం మరవలేం.

“సవాళ్లను ఎదుర్కోవాలి... ఇబ్బందులను అధిగమించాలి... దీన్ని యువత అందిపుచ్చుకోవాలి. పదవులు వస్తే గ్లామరే కాదు... రాళ్లు కూడా పడతాయి. వీటిని ఎదుర్కొనడం యువత అలవరచుకోవాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నార్టీలు అద్భుతంగా పని చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ సహకరించారు, బీజేపీ కలిసి వచ్చింది. రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలి... సహకరించమని ఎన్నార్టీలను కోరితే క్షణం కూడా ఆలోచన చేయకుండా తరలి వచ్చారు... కూటమి కోసం పని చేశారు. రాష్ట్రంలోని నేతలు, కార్యకర్తలతో సమానంగా కొందరు ఎన్నార్టీలు కూడా కేసులు పెట్టించుకున్నారు. ప్రజల ఆశీస్సులు, మీ సహకారంతో 93 స్ట్రైక్ రేట్ తో అద్భుత విజయం సాధించాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్ నిర్మించడం సాధ్యమా...? అని అందరూ ఆందోళ చెందారు. కానీ 18 నెలల కాలంలో బ్రాండ్ పునరుద్దరించాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పని చేస్తున్నాం. అభివృద్ధి విషయంలో మంత్రులు, నేను పోటీ పడ్డాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించాం. దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయి. అలాగే దేశానికి వచ్చిన అతి పెద్ద పెట్టుబడి గూగుల్ రూపంలో ఏపీకే వచ్చింది. ఆర్సెల్లార్ మిట్టల్ రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తున్నారు. కాకినాడలో గ్రీన్ అమోనియ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాను. ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేసేలా పరిశ్రమలు స్థాపిస్తున్నాం. అలాగే తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోళ్లు చేపడుతున్నాం. విద్యుత్ విషయంలో సంస్కరణలు చేపట్టడం వల్ల డేటా సెంటర్లు రాష్ట్రానికి వస్తున్నాయి. మొత్తంగా రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులపై కసరత్తు చేస్తున్నాం. ఇది సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలం. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చి విదేశాల్లో స్థిరపడ్డారు... మీ ఊళ్లల్లో ఉన్న వారిని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా చేసి అభివృద్ధి చేస్తున్నాం. యూరప్ లో లిచెన్ స్టైన్ చాలా చిన్న దేశం. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్లే లిచెన్ స్టైన్ సంపన్న దేశంగా ఎదిగింది. అందుకే క్వాంటం, ఏఐ, స్పేస్, డ్రోన్ టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నాం. డ్రోన్ల ద్వారా ప్రజలకు, వ్యవసాయ, వైద్య రంగాలకు సేవలు అందించేలా చూస్తాం. డ్రోన్ ఆపరేషన్లకు పర్మిషన్లు ఇచ్చే బాధ్యతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకోవాలని కోరుతున్నాను. ఎలక్ట్రానిక్స్, హెల్త్ డివైసెస్, ఫార్మా రంగాల అభివృద్ధిపై రాష్ట్రం దృష్టి సారించింది. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజారోగ్యం మెరుగయ్యేలా చర్యలు చేపడుతున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. నీటి భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఏపీ రిజర్వాయర్ల లో 958 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఏఐకు చిరునామాగా భారతీయులు, తెలుగు వాళ్లే ఉన్నారు. దీన్ని అందిపుచ్చుకుని మరింత అభివృద్ధి సాధించాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఒకరు ఉద్యోగం... మరొకరు వ్యాపారం

“జన్మభూమిని మరిచిపోతే చరిత్ర హీనులవుతారు. అలాగే ఖర్మ భూమికి సేవలు అందించాలి. విదేశాల్లో ఉద్యోగాల కోసం వచ్చే వాళ్లు అక్కడి స్థానిక పరిస్థితులతో కలిసిపోవాలి. ఏ ప్రాంతంలో ఉంటే.. ఆ ప్రాంతంలోని స్థానికులతో మమేకం కావడమనేది తెలుగు వారి ప్రత్యేకత. ఉద్యోగాలు చేసే వాళ్లుగా కాదు, ఉద్యోగాలు ఇచ్చే వాళ్లుగా తెలుగు జాతి ఎదగాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తాం. ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ అనేది ప్రభుత్వ విధానం. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వాళ్లల్లో భార్య-భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే... ఒకరు ఉద్యోగం చేయండి... మరొకరు వ్యాపారం చేయండి. ఏపీలో వ్యాపారాలకు, పరిశ్రమలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య రంగంలోకి రావాలనుకున్న ఎన్నార్టీలకు సహకరిస్తాం. విదేశాల్లోను వ్యాపారాలు చేసుకుంటామంటే చేయండి.. ఏపీలో పెట్టుబడులు పెడతామన్నా స్వాగతిస్తాం. ఎన్నార్టీలను పారిశ్రామిక వేత్తలుగా చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తూ రూ. 50 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి ప్రభుత్వం తరపున సహకరిస్తాం.. గైడ్ చేస్తాం. కొంచెం కొత్త తరహాలో ఆలోచన చేస్తే పారిశ్రామిక వేత్తలుగా రాణించగలరు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని కో-ఆర్డినేట్ చేసి.. వారిని అభివృద్ధి చేసేలా... పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి వారు బాధ్యత తీసుకోవాలి. ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని స్థాపించాలి.”అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

విదేశీ విద్య... మా బాధ్యత

“చదువు కోవాలని అనుకునే ప్రతి ఒక్కరినీ చదివిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా మంచి యూనివర్శిటీలు ఎక్కడున్నా విద్యార్థులకు అవకాశాలు అందేలా చేస్తాం. 4 శాతం వడ్డీతో రుణాలు ఇప్పించి విదేశీ విద్య అందించేలా మేం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇస్తాం. ఏపీ ఫస్ట్ అనే అతి పెద్ద రీసెర్చ్ వ్యవస్థను తెస్తున్నాం. ఐఐటీ-ఐఐఎస్ఈఆర్ కాంబినేషన్ తో ఈ రీసెర్చ్ సెంటర్ తిరుపతిలో స్థాపిస్తున్నాం. కొత్త ఆవిష్కరణలతో యువతకు ఉపాధి చూపించేలా కృషి చేస్తున్నాం. 2047 నాటికి దేశం అగ్రభాగాన నిలుస్తుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్-1 కావాలి.. తెలుగు జాతి వెలగాలి. 30 ఏళ్లకు ముందు భారత దేశం గురించి ప్రత్యేకంగా చర్చించుకునే వారు కాదు... కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఇందులో మనం భాగస్వాములం కావాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఉత్సాహంగా... ఉల్లాసంగా...

ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న తెలుగు డయాస్పోరా కార్యక్రమం ఆసాంతం ఆసక్తిగా సాగింది. ఐరోపాలోని 20 దేశాల నుంచి తెలుగు ప్రజలు తరలి వచ్చారు. డయాస్పోరా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు వారు వచ్చి స్థిరపడ్డారని చెబుతూ చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల పేర్లు ప్రస్తావించినప్పుడు సభికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. వివిధ దేశాలకు చెందిన ఎన్నార్టీ ప్రతినిధులు ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రస్తుతం ప్లకార్డులు ప్రదర్శిస్తున్నా వచ్చే ఏడాది తన పర్యటనలో ఎన్నార్టీల అభివృద్ధి గురించి ప్లకార్డులు ప్రదర్శించాలని సీఎం సూచించారు. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమం అనంతరం తెలుగు కుటుంబాలను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. గోదావరి పుష్కరాలకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబు తెలుగువారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఏపీ ఎన్నార్టీ సొసైటీ అధ్యక్షుడు వేమూరి రవి పాల్గొన్నారు.

Next Story