చిత్తూరు జిల్లా కుప్పం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వేదిక వద్దకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కలకలం రేపాడు. దీంతో అతడిని టీడీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. బాంబు తెచ్చాడంటూ అనుమానంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా సిబ్బంది బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు తెరిచి చంద్రబాబుకు రక్షణగా నిలిచారు.
రాష్ట్రాన్ని పాలించే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. విశాఖ ఏజెన్సీలో పెద్ద మొత్తంలో గంజాయి సాగు చేస్తున్నారని, రూ.8 వేల కోట్ల విలువైన గంజాయి సరఫరా చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరితే టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం సాగుతోందని రాష్ట్రపతికి తెలిపానని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. తనపై బాంబులు వేస్తామని అంటున్నారని, బాంబులకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు. పేదల కోసం పోరాటం చేస్తున్న తనను ప్రజలే కాపాడుకుంటారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నాసిరకం లిక్కర్ బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలాగాటమాడుతున్నారని, ఎన్నికల ముందు మద్యపాన నిషేధం హామీ ఇచ్చి.. ఇప్పుడు మద్యం షాపులు తెరిచారని విమర్శించారు.