మరోసారి వాలంటీర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు.
By Medi Samrat Published on 4 April 2024 1:28 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు.. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో రూ.5 వేల జీతం తీసుకుంటూ, ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేయడం న్యాయమా అని అడుగుతున్నానన్నారు. మేం అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని తీసెయ్యం, వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామన్నారు చంద్రబాబు. కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే మీ విధి, ఈ మాటే చెబుతున్నానన్నారు. ఎన్నికల సంఘం కూడా ఇదే చెబుతోందని, వాలంటీర్లు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని తెలిపారు. ఎన్నికలు అయిపోయేవరకు వీళ్లెక్కడా జోక్యం చేసుకోకూడదు, ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈసీ చెప్పింది. ఇక అక్కడ్నించి జగన్ శవరాజకీయాలు బయల్దేరాయని.. పండుటాకుల వంటి ముసలివాళ్లను చంపేయాలని కక్షగట్టాడని విమర్శించారు చంద్రబాబు.
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని పవన్ కల్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారని, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. కేంద్రంలో మళ్లీ వచ్చే పార్టీ బీజేపీయేనని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా కలిశాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత పురందేశ్వరి పోటీ చేస్తున్నారని, రాజానగరం, నిడదవోలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. వారందరినీ గెలిపించాలని కోరారు చంద్రబాబు.