పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన గమ్యస్థానం : సీఎం చంద్రబాబు
దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఇండియా లాంజ్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
By - Medi Samrat |
దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఇండియా లాంజ్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. నేషన్ ఫస్ట్ అనే స్పూర్తి చాటేలా టీమ్ ఇండియాగా అంతా కలసి పనిచేద్దామని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులకు సీఎం పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత్ బలమైన ఆర్ధిక వ్యవస్థగా వేగంగా రూపాంతరం చెందుతోందన్నారు. ప్రపంచంలోనే భారత్ ఇప్పుడు పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్య స్థానమని.. ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు మాత్రమే చూస్తున్నాయన్నారు.
మన దేశానికి బలమైన నాయకత్వం ఉందని.. మన శక్తి సామర్ధ్యాలను ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. పటిష్టమైన వ్యవస్థల రూపకల్పన కూడా జరుగుతోందన్నారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినా అంతా భారత్ కే ప్రాతినిధ్యం వహిస్తున్నామన్నారు. రాష్ట్రాలుగా పోటీపడినా దేశంగా ఒక్కటిగానే ఉన్నాం.. పరస్పర సహకారం అందించుకుంటున్నామన్నారు. సంపద ఒక్కటే కాదు.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నారు. ఏపీలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ప్రపంచం ఎలా ముందుకు వెళ్తోందో నేర్చుకునేందుకు వీలుంటుందన్నారు. ప్రస్తుతం అంతా గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని.. వచ్చే రెండేళ్లలో భారత్ 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా.. 2047 నాటికి అగ్రస్థానానికి చేరుతుందన్నారు.