నేను చేసిన అభివృద్ధిని 52 రోజులూ గుర్తు చేసుకున్నారు : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుద‌ల‌య్యారు. విడుద‌ల అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  31 Oct 2023 6:00 PM IST
నేను చేసిన అభివృద్ధిని 52 రోజులూ గుర్తు చేసుకున్నారు : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుద‌ల‌య్యారు. విడుద‌ల అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తాను నిర్దోషిని అని.. ఏ తప్పు చేయలేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం నా ప్రాణం ఉన్నంత వరకూ కష్టపడతాన‌న్నారు. 'నా రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదు.. చేయబోను' అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూసి తన జన్మ ధన్యమైందన్నారు. జనసేన, పవన్ బహిరంగంగా తనకు అండగా నిలబడిందని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు, ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువనని పేర్కొన్నారు.

"మీ అభిమానంతో నా జన్మ ధన్యమైంది. నేను చేసిన అభివృద్ధిని 52 రోజులూ గుర్తు చేసుకున్నారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లోనూ ప్రజలు రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారు.. పూజలు చేశారు. మీరు చూపించిన అభిమానాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

కోర్టు ఆదేశాలు ఉన్నందున‌ స్కిల్ స్కాంపై చంద్ర‌బాబు మాట్లాడలేదు.. ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు. ఇదిలావుంటే.. జైలు నుంచి బయట వచ్చిన వెంటనే నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, బాలకృష్ణ ఆయన వద్దకు వెళ్లారు. మనవడు దేవాన్షన్‌ని చూసి చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.

Next Story