విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి : సీఎం చంద్రబాబు
విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
By - Medi Samrat |
విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వినూత్న ఆలోచనలకు భవిష్యత్ కాలంలో మంచి అవకాశాలు దక్కుతాయన్నారు. వినూత్నంగా ఆలోచన చేసేవారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని... యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి శుక్రవారం చేరుకున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలంలో ఆగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రాంగణంలోని టీచర్ ట్రైనింగ్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ. 3 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆగస్త్య విద్యాచల్ అకాడమీ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఏడాదికి 5 వేల మంది టీచర్లు, స్కూల్ లీడర్లను తీర్చిదిద్దేలా ఆగస్త్య విద్యాచల్ అకాడమీ శిక్షణ ఇవ్వనుంది. ఆధునిక, శాస్త్రీయ శిక్షణా కేంద్రంగా అగస్త్య విద్యాచల్ అకాడమీకి జాతీయ స్థాయిలో మంచి పేరుంది. DIETలు, బ్లాక్ రిసోర్స్ సెంటర్లు, లైవ్ ఇంట్రాక్షన్ కోసం టూ వే బ్రాడ్ కాస్ట్ స్టూడియోలతో అత్యాధునిక ఏర్పాట్లు ఈ టీచర్ ట్రైనింగ్ సెంటర్లో చేశారు. అకాడమీలోని శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ట్రైనింగ్ సెంటరుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు అకాడమీ ప్రాగంణంలోనే లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్ల వ్యయంతో అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మించేలా ప్రణాళికలను సిద్దం చేసింది ఆగస్త్య అకాడెమీ సెంటర్. ప్రస్తుతం 240 మందికి అకాడెమిషన్ ఫెసిలిటీ కల్పిస్తుండగా... దీన్ని మరింత విస్తరిస్తూ ఆగస్త్య విద్యాచల్ అకాడెమీ నిర్మాణాలు చేపట్టింది. ఇదే ప్రాంగణంలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్ కు సీఎం శంకుస్థాపన చేశారు. మల్టీ మీడియా ఎక్స్ పీరియన్స్ కలిగించేలా విజిటర్స్ సెంటర్ రూపకల్పన చేసినట్టు ఆగస్త్య విద్యాచల్ అకాడెమీ ప్రతినిధులు సీఎంకు వివరించారు.
ట్రైనింగ్ పరిశీలన... విద్యార్థులతో ముఖాముఖి
ట్రైనింగ్ తీసుకుంటున్న టీచర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పలకరించారు. రకరకాల కిట్లతో టీచర్ ట్రైనింగ్ ఇస్తున్న విధానాన్ని పరిశీలించారు. పిల్లలకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన ఏ విధంగా చేయాలనే అంశంపై శిక్షణ తీసుకుంటున్నట్టు సీఎంకు టీచర్లు వివరించారు. ఆ తర్వాత అలాగే ఆగస్త్య విద్యాచల్ అకాడెమీలోని ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అకాడెమీ చేపడుతున్న కార్యక్రమాలు, విద్యార్థులకు శాస్త్ర, సాంకేతికాంశాలపై అందిస్తున్న శిక్షణపై వీడియో ప్రదర్శనను విద్యార్థుల మధ్యలో కూర్చొని ముఖ్యమంత్రి చూశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖ్యమంత్రి ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”ఈ సంస్థ ఛైర్మన్ రామ్ జీ రాఘవన్ తో నాకు 25 ఏళ్ల నుంచి పరిచయం. మంచి ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభిస్తానని నాతో చెప్పారు... నేను అంగీకరించాను. 25 ఏళ్లుగా ఈ అకాడమీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇండియాలో ప్రముఖ సెంటరుగా పేరు తెచ్చుకుంది. స్వచ్ఛమైన వాతావరణంలో ఈ అకాడెమీ ఏర్పాటైంది. ఈ అకాడెమీలో చేపడుతున్న విధానాలే ఏపీ ఫ్యూచర్ విధానాలు. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాలను అందిపుచ్చుకోవాలి. అలా అందిపుచ్చుకోవడం వల్లే ఐటీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు విస్తరించారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశాను... ఇప్పుడు ఏఐ గురించి అందరూ ఆలోచన చేయాలని చెబుతున్నాను.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
భవిష్యత్ ఎలా ఉండబోతోందో విద్యార్థులు అంచనా వేయాలి
“విద్యార్థుల ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి... భవిష్యత్ మనదే. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఆవిష్కరణలు వస్తాయి. కొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్ కంపెనీలకు అవకాశాలు దక్కేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. డ్రోన్, స్పేస్ సిటీ వంటి వాటితో భవిష్యత్ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. భవిష్యత్ భారతదేశం ఎలా ఉండబోతోందనే అంశంపై విద్యార్థులు కూడా అవగాహన పెంచుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు... ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను గమనించాలి. విద్యుత్ రంగంలో మార్పులు వస్తున్నాయి... విద్యుత్ కొనుగోళ్లు ఛార్జీలు తగ్గించగలిగాం. టెక్నాలజీని అందిపుచ్చుకుంటే విద్యుత్ ఛార్జీలను తగ్గించవచ్చు. కుప్పాన్ని ప్రయోగశాలగా చూస్తాను... ఇక్కడికి అన్ని రకాల టెక్నాలజీలను తెస్తున్నాం. హంద్రీ-నీవా ద్వారా కుప్పం వరకు నీళ్లను తెచ్చాం... నీటి భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. నీటి సంరక్షణ విషయంలో ఆగస్త్య అకాడెమీ ప్రతినిధులు వినూత్నంగా ఆలోచన చేయాలి. నీటి సంరక్షణ, నీటి సద్వినియోగం విషయంలో కుప్పంలో పైలెట్ ప్రాజెక్టు చేపడదాం.”అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, కుప్పం స్థానిక నేతలు పాల్గొన్నారు.