ఉచిత ఇసుకపై చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త

ఉచిత ఇసుక విధానాన్ని సరళతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

By అంజి  Published on  3 Sep 2024 4:36 AM GMT
CM Chandrababu, AP Govt, free sand policy, APnews, DLSC

ఉచిత ఇసుకపై చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త

ఉచిత ఇసుక విధానాన్ని సరళతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్‌లైన్‌పై అవగాహన లేని వాళ్లు గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఇసుక బుక్‌ చేసుకోవచ్చు. ఏ రీచ్‌, ఏ స్టాక్‌ నుంచి ఎప్పుడు ఇంటికి ఇసుక చేరుతుందో వివరిస్తూ స్లాట్‌ కేటాయిస్తారు. వాగులు, వంకలు, నదుల నుంచి ప్రజలు ఎద్దుల బండ్లలో ఫ్రీగా ఇసుకను తీసుకు వెళ్లవచ్చు. ఇసుకను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని థర్డ్‌ పార్టీతో అధికారులు పరిశీలిస్తున్నారు. ఇసుక.. అవసరం ఉన్న వారికి మరింత సులువుగా దొరికేలా, అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఉచిత ఇసుక విధానంకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా విడుదల చేశారు.

ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ కోసం గనుల శాఖ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంటి నిర్మాణం పథకం లబ్ధిదారులకు పోర్టల్‌లో ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. ఇసుక కావాల్సిన వారు నిర్మాణ వివరాలు పేర్కొని డైరెక్ట్‌గా బుక్‌ చేసుకోవచ్చు. ఇసుక తరలించాక సక్రమంగా వినియోగిస్తున్నారా? దారి మళ్లించారా అన్నది తెలుసుకునేందుకు థర్డ్‌ పార్టీతో అధికారులు పరిశీలన జరిపిస్తారు. ఇసుక దారి మళ్లింపు లేకుండా అర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌తో నిఘా పెడతారు. జీపీఎస్‌ కలిగి ఉండి, గనుల శాఖ వద్ద రిజిస్టర్‌ చేసుకున్న వాహనాల్లోనే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుంది. వాహనం, దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలను జిల్లాస్థాయి ఇసుక కమిటీ నిర్ణయిస్తుంది. అయితే బల్క్‌ బుకింగ్‌దారులు సొంతంగా వాహనాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇసుక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తారు.

Next Story