తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని అన్నారు.

By Medi Samrat  Published on  14 Dec 2023 12:00 PM GMT
తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు తమ వ్యతిరేకతను బయటపెడుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి-మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది... ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు... డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి అని అన్నారు. ఓడిపోతామని తెలిసి జగన్ హడావుడిగా చర్యలు మొదలుపెట్టాడని, 11 మంది ఇన్చార్జిలను ఇతర నియోజకవర్గాలకు మార్చేశాడని.. ఒక చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుతుందని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. బీసీల జపం చేస్తున్న జగన్ కు నిజంగా వారిపై అంత ప్రేమే ఉంటే పులివెందుల టికెట్ బీసీలకు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. జగన్ వచ్చిన తర్వాత చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక పార్టీ లేదు.. అందరూ నాశనమైపోయే పరిస్థితి వచ్చింది.

ఇది నా ఎలక్షన్ కాదు, లేకపోతే టీడీపీ ఎన్నికలు కాదు, టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఇది మా ఇద్దరి ఎన్నికలు అంతకన్నా కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఈ ఎన్నికలు జరగబోతున్నాయన్నారు చంద్రబాబు. ఏవో విన్యాసాలు చేసి, నాటకాలు ఆడి... ఇన్చార్జిలను మార్చేస్తే గెలుస్తామనుకుంటున్నారేమో... అది జరగని పని. ఒక నియోజకవర్గంలో పాపాలు చేసిన వారిని మరో నియోజకవర్గానికి మార్చేస్తే గట్టెక్కుతామనుకుంటే అంతకంటే తప్పిదం మరొకటి ఉండదన్నారు చంద్రబాబు.

Next Story