టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని శెట్టిపల్లె సభలో మాట్లాడుతూ, సినిమా టికెట్ల అంశంపై స్పందించారు. భారతి సిమెంట్ రేట్లు తగ్గించరట కానీ, సినిమా టికెట్ల ధరలు మాత్రం తగ్గిస్తారట అని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో.. ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ప్రకటించారని విమర్శించారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారే తప్ప ఉద్యోగులు కాదని అన్నారు. రిటైర్ అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్యోగుల పదవీవిరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని ఆరోపించారు. గతంలో తాము 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్రంలో వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఎస్సీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎస్సీ మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపారని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మాస్కు పెట్టుకోరని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. దళితులకు జరిగిన అవమానంపై మంత్రి పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. దళితుల ఆత్మహత్యలకు వైసీపీ సర్కార్ కారణంగా నిలుస్తోందని చంద్రబాబు ఆరోపించారు.