కుప్పంపై పెద్దిరెడ్డి కన్ను పడింది.. అందుకే.. : చంద్రబాబు
కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతూ ఉంది.
By Medi Samrat Published on 29 Dec 2023 12:45 PM GMTకుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతూ ఉంది. రెండోవ రోజు మధ్యాహ్నం కుప్పంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో నుండి బయటకు వచ్చి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని గ్రానైట్ నిక్షేపాలను కొట్టేయడానికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుప్పం పై కన్ను వేశారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ ఓటమి ఎరుగని స్థానాలు హిందూపురం, కుప్పం నియోజకవర్గాలేనని, తాను మొదటి నుంచి అనేక సంక్షేమ పథకాలు కుప్పం నుంచి ప్రారంభించానని, ఒక్క రోడ్డు ఉండే కుప్పం ను ఇవాళ ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తే వాళ్ళు హంద్రీ నీవా జలాలు కుప్పం కు రాకుండా చేశారన్నారు. సరైన అనుమతులు లేకుండా జిల్లాలో ప్రాజెక్టులు చేపట్టడం వల్లనే చివరకి కోర్టుకి వెళ్లి ఫైన్ లు కట్టారని ఎద్దేవా చేసారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పిఏ ఆత్మహత్య వెనుక అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం కొత్తగా తెస్తున్న ల్యాండ్ టైటలింగ్ చట్టం చాలా ప్రమాదకరమైనదని, దీంతో ప్రజల భూములు కొట్టేయడం చాలా సులభం అవుతుందని అన్నారు. ఈ చట్టం చదివితే నాకే భయమేస్తోందని చంద్రబాబు అన్నారు. గత ఎన్నికల్లో జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ కావాలన్నారు.