ఆరోగ్య శ్రీ లేనట్లేనా.? చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలి
ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయని APCC చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 30 July 2024 12:32 PM GMTఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయని APCC చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా.? ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా.? ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా.? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా.? పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం.? ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా.? ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా.? అని ప్రశ్నలు సంధించారు.
గత వైసీపీ ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే.. ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయన్నారు. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయన్నారు. దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన అద్భుత పథకం. పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకం. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకం. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించం అని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి సర్కార్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 16 వందల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని.. పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.