జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు, పవన్
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
By అంజి Published on 15 Aug 2024 10:03 AM IST
జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు, పవన్
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రౌండ్‌లో పరేడ్ నిర్వహించిన అనంతరం సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు మువ్వన్నెల జెండాను ఎగురవేస్తున్నారు.
2014 - 19 మధ్య ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయని దుయ్యబట్టారు. వైసీపీ పాలకులు కనీవినీ ఎరుగని విధ్వంసం చేశారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని అన్నారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియాతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు.
సమరయోధుల బాటలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సుపరిపాలనను అందిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. సూపర్ సిక్స్ అమలుకు షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు. సామాజిక ఫించన్ల మొత్తాన్ని పెంచామని తెలిపారు. ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, డొక్కా సీతమ్మ పేరిట స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలకు రూ.5కే భోజనం కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమరయోధుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.