Local Reservations: 95 శాతం పోస్టులు స్థానికులకే.. స్థానికత గుర్తింపు ఇలా..

ఉద్యోగ నియామకాల్లో స్థానికతపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఇకపై 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు స్థానికులకే దక్కనున్నాయి.

By -  అంజి
Published on : 17 Dec 2025 7:59 AM IST

Central govt, new presidential order, local reservations, APnews, jobs, education

Local Reservations: 95 శాతం పోస్టులు స్థానికులకే.. స్థానికత గుర్తింపు ఇలా..

అమరావతి: ఉద్యోగ నియామకాల్లో స్థానికతపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఇకపై 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు స్థానికులకే దక్కనున్నాయి. మరో 5 శాతం ఓపెన్‌ కోటాలో ఉండనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆర్డర్‌ -2025 గెజిట్‌ను కేంద్రం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రపతి ఉత్తర్వు(ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌)ను విడుదల చేసింది.

డైరెక్ట్‌ నియామకాల్లో స్థానిక, స్థానికేతర కోటాలతో పాటు జిల్లా, జోనల్‌, రాష్ట్ర స్థాయి పోస్టులను నిర్దేశించింది. గతంలో 4 జోన్లు ఉండగా.. తాజాగా 26 జిల్లాలను 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా మార్చింది. గతంలో రాష్ట్ర కేడర్‌ పోస్టులుగా ఉన్న సీటీవో, డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ పోస్టులను మల్టీజోనల్‌ పోస్టులుగా మార్చారు. రాష్ట్ర స్థాయి పోస్టులకు పోటీ అధికం కావడంతో వీటిని మల్టీజోనల్‌ పోస్టులుగా చేశారు.

గతంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్క చదివితే ఆ ప్రాంతంలో స్థానికులుగా నిర్ణయించేవారు. ఇప్పుడు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో స్థానికత నిర్ణయించేందుకు నివాస ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మరోవైపు ఉద్యోగుల విభజన విషయంలో ఛాయిస్‌ ఎంప్లాయీస్‌కే ఇవ్వనున్నారు. వయసు, సీనియారిటీ, మిగులు సర్వీసు కాలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

జూనియర్‌ అసిస్టెంట్‌ అంతకంటే దిగువ పోస్టులకు జిల్లా యూనిట్‌గా రిక్రూట్‌మెంట్‌, బదిలీలు జరుగుతాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ కంటే పై క్యాడర్‌ నుంచి ఫస్ట్‌ లెవల్‌ గెజిటెడ్‌ అధికారి వరకు జోన్‌ యూనిట్‌గా భర్తీ, బదిలీలు ఉంటాయి. ఆపై పోస్టులకు మల్టీజోన్‌ ప్రాతిపదికన జరుగుతాయి. సచివాలయం, హెచ్‌వోడీ, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి ఉద్యోగులు లోకల్‌, జోనల్‌, మల్టీజోనల్‌ క్యాడర్లలో డిప్యుటేషన్‌పై వెళ్లి పనిచేయొచ్చు.

స్థానికతపై ఆర్డర్‌ జారీ కావడంతో.. 27 నెలల్లోగా రాష్ట్రప్రభుత్వం జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టులను నిర్ణయించాలి.

మల్టీజోన్‌-1లో జోన్‌-1, 2, 3... మల్టీజోన్‌-2లో జోన్‌-4, 5, 6 ఉన్నాయి.

జోన్‌-1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు.

జోన్‌-2: అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ.

జోన్‌-3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా

జోన్‌-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం

జోన్‌-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప

జోన్‌-6: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి

Next Story