ఏపీకి కేంద్రం శుభవార్త..రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By -  Knakam Karthik
Published on : 9 Jan 2026 3:40 PM IST

Andrapradesh,  Khelo India funds, Central Government, Ap Govt, Sports

ఏపీకి కేంద్రం శుభవార్త..రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు ఖేలో ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.60.76 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక క్రీడా మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా రూరల్‌ మండలం పాత్రునివలసలో రూ.14 కోట్ల వ్యయంతో ఒక ఇండోర్‌ హాల్‌ను నిర్మించనున్నారు. అలాగే చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.14 కోట్లతో బహుళ ప్రయోజన భవన సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాజమహేంద్రవరంలో రూ.13.76 కోట్లతో ఆధునిక సదుపాయాలతో కూడిన బహుళ ప్రయోజన ఇండోర్‌ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో క్రీడా వసతుల అభివృద్ధికి పెద్దపీట వేశారు.

అక్కడ రూ.9.80 కోట్లతో 8 లేన్ల సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌, రూ.6 కోట్లతో గ్రాస్‌ ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌, రూ.1.80 కోట్లతో టెన్నిస్‌ కోర్టు, రూ.92 లక్షలతో బాస్కెట్‌బాల్‌ కోర్టును నిర్మించనున్నారు. అదనంగా రూ.1.08 కోట్లతో ఫ్లడ్‌ లైట్లు, 200 మీటర్ల ట్రాక్‌ సహా ఇతర అవసరమైన సదుపాయాలను కూడా కల్పించనున్నారు. గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు కోసం రూ.14 కోట్ల మేర సవరించిన ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Next Story