రాష్ట్రానికి 13,050 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ గురువారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 20వ తేదీకి గంగవరం పోర్ట్ కు యూరియా రాష్ట్రానికి చేరుతుందని అన్నారు. ఈ కేటాయింపుతో రైతులకు మరింత వెసులుబాటు లభిస్తుందని , రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.
రైతుల భవిష్యత్తు కోసం కూటమి దృఢంగా నిలబడి ఉందని, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి రైతు అవసరాలను, సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సమగ్ర దృష్టితో ముందుకొస్తుందని, రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటలకు సరైన మార్కెటింగ్‌ను అందించడం కూటమి లక్ష్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవతోనే ఇతర రాష్ట్రాల కన్నా అధిక మొత్తంలో రాష్ట్రానికి యూరియాను కేంద్రం కేటాయిస్తుందని మంత్రి అచ్చెన్న తెలిపారు.