మాజీ ఎంపీ రాయపాటి ఇంటిపై సీబీఐ అధికారుల దాడులు

CBI Raids On Rayapati Sambasiva Rao House. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు

By Medi Samrat  Published on  18 Dec 2020 8:13 AM GMT
మాజీ ఎంపీ రాయపాటి ఇంటిపై సీబీఐ అధికారుల దాడులు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వ‌హించారు. గుంటూరులోని రాయపాటి నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సీబీఐ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. శుక్ర‌వారం ఉదయం 8 గంటల నుంచి సీబీఐ అధికారుల‌ సోదాలు కొనసాగుతున్నాయి. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి సంబంధించిన ప‌లు రికార్డుల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాయ‌పాటి కుటుంబ స‌భ్యుల్ని కూడా విచారిస్తున్న‌ట్లు స‌మాచారం.

వివిధ బ్యాంకులనుంచి రాయపాటి రూ.300 కోట్ల రుణం తీసుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం చెల్లించకుండా ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ గతంలో పోలవరం ప్రాజెక్టు పనులను చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాయపాటి సోదరులది ప్రత్యేకమైన స్థానం. రాయపాటి సాంబశివరావు రాజ్యసభ సభ్యుడిగా, గుంటూరు, నర్సరావుపేట ఎంపీగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా, ఇప్పటికే పలు దపాలుగా రాయపాటి నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Next Story