వారిపై గూండా యాక్ట్ కింద కేసులు పెడ‌తాం : పవన్ కళ్యాణ్

పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాకు పాల్పడే వ్యక్తులపై గూండా యాక్ట్ కింద కేసులు పెడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

By Medi Samrat  Published on  7 Dec 2024 9:15 PM IST
వారిపై గూండా యాక్ట్ కింద కేసులు పెడ‌తాం : పవన్ కళ్యాణ్

పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాకు పాల్పడే వ్యక్తులపై గూండా యాక్ట్ కింద కేసులు పెడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కడప జిల్లాలో పాఠశాలల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్ధులకు సరైన చదువు ఇవ్వకపోతే సమాజం అభివృద్ధి చెందదన్నారు. పాఠశాలలు, విద్యార్ధుల సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకున్నా మనస్సు పెద్దదని, తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి దారులు వెతుకుతున్నామని చెప్పారు. శనివారం కడప నగరంలోని మద్రాస్ రోడ్డులోని మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాల విద్యార్ధులతో ముఖాముఖి సమావేశం అయ్యారు. పాఠశాలలోని వంటశాల నవీకరణకు నిధుల కొరత ఉందన్న విషయం జిల్లా కలెక్టర్ ద్వారా తెలుసుకుని, అందుకు అయ్యే ఖర్చు మొత్తం పవన్ కళ్యాణ్ తన సొంత ట్రస్ట్ నుంచి అందజేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. "విద్యార్ధుల భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 44 వేల పాఠశాలల్లో కోటి మంది విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొనేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి నేను కడప ఎంచుకోవడానికి కారణం - రాష్ట్రంలోనే అత్యధిక గ్రంథాలయాలతో వెలసిల్లిన ప్రాంతం ఇది. కడప చదువుల గడ్డ. అన్నమయ్య, వేమన, మొల్ల, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయులు పుట్టిన నేల. రాయలసీమ అంటే వెనుకబాటు కాదు. అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతం. ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తెస్తాం. ప్రభుత్వ పాఠశాలలు బలపడాలని నేను కోరుకుంటాను. ప్రభుత్వ పాఠశాలు కార్పోరేట్ స్కూల్స్ తో సమంగా అభివృద్ధి చెందాలి. అందుకు కేంద్రం స్కీములు, నిధులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే కార్పోరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముందుకు తీసుకువెళ్లవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిర్దేశకత్వంలో 21వ శతాబ్దానికి భావి భారత పౌరులను అందించేలా ముందుకు వెళ్లాలి. మీ బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. తల్లిదండ్రులు సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే వాటిని తీర్చే బాధ్యత మేము స్వీకరిస్తాము.

నా తల్లిదండ్రులు నాకు విలువలు నేర్పారు

మాదక ద్రవ్యాల వ్యాప్తి విద్యార్ధుల భద్రత పై ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యాప్తి భారీగా పెరిగిపోయింది. సోషల్ మీడియా విస్తృతి కూడా విద్యార్ధులపై ప్రభావం చూపుతోంది. విద్యార్ధుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం బలంగా పని చేస్తుంది. పిల్లలు సోషల్ మీడియా తక్కువగా వాడేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనా ఉంది. స్మార్ట్ ఫోన్ ను చదువు కోసం, అభివృద్ధి చెందడం కోసం వాడుతున్నారా లేక చెడు మార్గాల వైపు వెళ్లేందుకు వాడుతున్నారా అనేది గమనిస్తుండాలి. దీంతో పాటు ఆడబిడ్డల భద్రత కూడా కీలకం. కర్నూలు జిల్లాలో స్కూలుకు వెళ్లి సుగాలి ప్రీతి అనే విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చనిపోయి ఏళ్లు గడుస్తున్నా దోషులకు శిక్ష పడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సుగాలి ప్రతి కేసు విచారణ వేగవంతం చేశాం. ఆడ బిడ్డల భద్రత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ప్రతి స్కూల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. సమస్యలు రాకుండా ఉండాలి అంటే తమ బిడ్డలు, పరిసర ప్రాంతాల్లో పరిస్థితుల పట్ల తల్లిదండ్రుల అప్రమత్తత కూడా అవసరం. తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగానే పిల్లలు పెరుగుతారు. మీ బిడ్డలకు యోగి వేమన సంస్కారం నేర్పాలి. నా తల్లిదండ్రులు చదువుకున్నది తక్కువే అయినా నాకు విలువలు నేర్పారు.

టీచర్లకు అత్యధిక వేతనం ఇచ్చే రోజు రావాలి

విద్యార్ధులు బాగా చదువుకోవాలి అంటే మంచి దేహధారుడ్యంతో కూడిన ఆరోగ్యం ఉండాలి. విద్యార్ధులకు సరైన పోషకాలు అందేందుకు ఏం చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా కేబినెట్ లో చర్చిస్తాము. దేశం బాగుండాలి అంటే మనం పెట్టుబడి పెట్టాల్సింది కాంట్రాక్టర్ల మీద కాదు. అధ్యాపకులు మంచి విలువలు ఉన్న బోధన చేస్తే దేశం బలంగా ఉంటుంది. నా టీచర్ చెప్పిన పాఠాల వల్లే నాకు దేశానికి సేవ చేయాలన్న ఆసక్తి పెరిగింది. దేశంలో అత్యధిక వేతనం టీచర్లకు వచ్చే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ దిశగా ప్రయత్నం చేస్తాను. టీచర్లకు కూడా పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అవసరం. తరగతి గదుల్లో పాఠాలు చెప్పడం ద్వారా వారు అలసిపోతుంటారు.

టీచర్లే నిజమైన హీరోలు

నా హీరోలు నా టీచర్లు. హీరోలు సినిమాల్లో మాత్రమే ఉండరు. నిజమైన హీరోలు మన కళ్ల ముందే ఉంటారు. జాతీయ స్థాయిలో కడప మున్సిపల్ స్కూల్ విద్యార్ధినికి బ్రాంజ్ మెడల్ గెలిచే స్థాయికి తీసుకువెల్లిన టీచర్ నిజమైన హీరో. సింహం గడ్డం గీసుకుంటుంది నేను గీసుకోను అని డైలాగులు సినిమాల్లో చెబితే వెనుక రీ రికార్డింగులు వస్తాయని. హీరో నడిచినా దానికి రీరికార్డింగ్ ఉంటుందని. కానీ వనజీవి రామయ్య, దశరథ్ మాంజీ లాంటి వారు నడుస్తుంటే రీ రికార్డింగులు ఉండవు. కార్గిల్ లో చనిపోయిన యుద్ధవీరులకు, టీచర్లకు రీరికార్డింగులు ఉండవు. ఆ సైనికులు, టీచర్లే నిజమైన హీరోలు. వారిని గౌరవించాలి. మనం హీరోలను చూసుకోవాల్సింది సినిమాల్లో నటించే వారిలో కాదు.. టీచర్లలో హీరోలను చూసుకోవాలి.

పాఠశాలల విలీనం సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన

కడప మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్ వంటశాల నవీకరణకు నిధుల అవసరం ఉందన్న విషయాన్ని కలెక్టర్నా దృష్టికి తీసుకువచ్చారు. అందుకు ఎంత ఖర్చు అయితే అంత నా సొంత ట్రస్ట్ నుంచి నిధులు ఏర్పాటు చేస్తాను. ప్రతిభాపాటవాలు చూపిన విద్యార్ధులు, అధ్యాపకులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించేందుకు నిధులు అవసరం అయితే సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాను. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విలీనం నిర్ణయం కారణంగా ఆడబిడ్డలు స్కూల్స్ కి వెళ్లలేకపోతున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. కలెక్టర్ల సమావేశం నాటికి వారికి గ్రామాలను కలుపుతూ వాహన సదుపాయం ఏర్పాటు చేసే అంశం మీద నిర్ణయం తీసుకుంటాం. కడప, రాయలసీమ తెగింపు ఉన్న బలమైన నేల. ఇక్కడ విద్యార్ధులు ఇక్కడే చదువుకోవాలి. ఇక్కడే ఉద్యోగాలు రావాలి. మీకు ఏమైనా సమస్యలు వస్తే బయటకు వచ్చి తెలియ చేయండి. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. పరిష్కారానికి మేము కృషి చేస్తాం. ఇక్కడకు వచ్చిన విద్యార్ధులందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలి. అధ్యాపకులు, తల్లిదండ్రుల కలయికను మరింత ముందుకు తీసుకువెళ్లాలి" అన్నారు.

Next Story