ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం
By Medi Samrat Published on 6 Nov 2024 4:40 PM ISTఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత ఏపీ కేబినెట్ సమావేశం జరగింది. ఈ భేటీలో డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పనకు.. రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా డ్రోన్ పాలసీ రూపకల్పన జరిగింది.
ఏపీని ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఓర్వకల్లును డ్రోన్ హబ్‌గా చేసేందుకు వ్యూహాలు రచించింది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రచించింది. ఇక్కడ 25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇవ్వడంతోపాటు.. రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. అలాగే 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సిద్దమైంది. అంతేకాదు.. డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యా సంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహం కూడా ఇవ్వనుంది.