ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓవర్టేక్ చేసే విషయంలో జరిగిన గొడవ.. ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు గొడవపడి క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపారు. ఈ కేసుకు సంబంధించి మైనర్‌ను పోలీసులు పట్టుకోగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. సంగం విహార్‌కు చెందిన మనోజ్ కుమార్ గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మాల్వియా నగర్ నుండి ఐదుగురు ఉద్యోగులను తీసుకొని మరొక ఉద్యోగిని పికప్ చేసుకోవడానికి మెహ్రౌలీకి వెళ్తుండగా అతడి క్యాబ్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. రాత్రి 8.40 గంటల ప్రాంతంలో ముగ్గురు నిందితులు బైక్‌పై వచ్చి దారి ఇవ్వాలని మనోజ్‌ను కోరగా, రోడ్డు మీద స్థలం లేకపోవడంతో కుదరలేదు. గొడవ కాస్తా పెద్దదవ్వడంతో ఒకరు కత్తితో మనోజ్ ఛాతిపై పొడిచాడు.
అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలో స్థానికులు మనోజ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల్లో ఒకరైన మైనర్ని గుర్తించి పట్టుకున్నారు. ప్రస్తుతం మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.