మాట నిల‌బెట్టుకున్న సీఎం జ‌గ‌న్‌.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి

Byreddy Siddharth Reddy Appointed as Sports Authority Chairman. తెలుగు రాష్ట్రాల్లో యూత్‌లో మాంచి ఫాలోయింగ్ ఉన్న వైసీపీ యువనేత

By Medi Samrat  Published on  17 July 2021 10:49 AM GMT
మాట నిల‌బెట్టుకున్న సీఎం జ‌గ‌న్‌.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి

తెలుగు రాష్ట్రాల్లో యూత్‌లో మాంచి ఫాలోయింగ్ ఉన్న వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి సీఎం వైఎస్ జగన్ కార్పోరేష‌న్ ప‌ద‌వుల‌లో కీలక పదవి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థ్‌ను నియమించారు. శనివారం విజ‌య‌వాడ ఆర్ ఎండ్ బీ గెస్ట్ హౌస్‌లో హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత ప్ర‌క‌టించిన‌ నామినేటెడ్ పదవుల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి స్థానం లభించింది. ఇక‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వైసీపీ గెలుపునకు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్నిక‌ల అనంత‌రం ఎమ్మెల్యే ఆర్థర్‌కు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి మధ్య వార్ న‌డుస్తోంద‌ని పెద్ద వార్తలు వచ్చాయి.


నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఆర్థర్ పేరుకు మాత్ర‌మే ఎమ్మెల్యే అని.. నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిదే పెత్త‌న‌మ‌ని వార్తలు కూడా వ‌చ్చాయి. లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్‌లో అనుచరులకు టికెట్లు ద‌క్క‌లేద‌ని ఇద్దరు నేత‌లు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్న‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే.. ఈ ఇద్దరు నేత‌ల‌ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌ను కర్నూలు జిల్లా వైసీపీ ఇన్‌చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చక్కదిద్దారని క‌ర్నూల్ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో టాక్‌. ఈ క్రమంలోనే యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి దక్కడం విశేషం.

ఇదిలావుంటే.. గ‌త‌ ఎన్నికల సమయం నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తన తమ్ముడు లాంటి వ్యక్తి అని.. అతడికి కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల ప‌ద‌వి ఇస్తానని హామీ ఇచ్చారు. జగన్ ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నార‌ని కార్య‌క‌ర్త‌లు, పార్టీ నేత‌లు అనుకుంటున్నారు.


Next Story