చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను, ప్రజలను మోసం చేసారని.. ఆలీబాబా దొంగల తరహాలో కేబినెట్ ఏర్పాటు చేసి దోచుకున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీలు వేసి ప్రతీ పనికి లంచాలు వసూలు చేసుకున్నారని మండిపడ్డారు. వృద్ధులు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకునే రోజు దగ్గరలోనే ఉందని ముత్యాల నాయుడు ప్రకటించారు.
వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గంలో జరిగింది. బస్సు యాత్రకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, విద్యా శాఖ బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. మొదట సామాజిక సాధికార యాత్రలో భాగంగా అలమండలో జగనన్న కాలనీలో లబ్ధిదారుడు నిర్మించుకున్న గృహాన్నీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం స్థానికంగా ఉన్న సచివాలయాన్ని సందర్శించారు.