తెలుగుదేశం పార్టీ నేత‌ బుద్దా వెంకన్న మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వివేకానందరెడ్డిది గుండెపోటో, గొడ్డలిపోటో తెలియాలంటే సీబీఐ తక్షణమే ఉత్తరాంధ్ర బందిపోటు విజయసాయిరెడ్డిని విచారించాలని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి హత్యోదంతం వెనకున్న అసలు వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ అధికారులు తక్షణమే విజయసాయిరెడ్డిని విచారించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.


వివేకానంద రెడ్డి చనిపోయింది గుండెపోటుతోనా.. గొడ్డలి పోటుతోనా అన్నసందేహం ప్రతిఒక్కరి లోనూ ఉందని.. మాజీమంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడైన వ్యక్తి మరణం వెనకున్న మిస్టరీ ఏమిటి? ఆయనది సహజమరణమా.. లేక హత్యాఅనేది తేలాలంటే.. సీబీఐ విజయసాయిరెడ్డిపై కన్నేయాలని అన్నారు. వివేకానంద రెడ్డి చనిపోయిన వెంటనే.. ఆఘమేఘాలపై ఘటనాస్థలికి వెళ్లి.. ఆయన గుండెపోటుతో మరణించారని చెప్పింది విజయసాయి రెడ్డేన‌ని.. అసలు విషయం బయటకు రాకముందే.. ఆయన ఎందుకు అలా చెప్పాడు? ఈ సందేహాలన్నింటికీ సమాధానం రావాలంటే.. విజయసాయిరెడ్డిని సీబీఐ తక్షణమే విచారణకు పిలవాలని అన్నారు.

వివేకా మృతిపై తొలుత గుండెపోటని, తరువాత హత్యని, ఆ తరువాత చంద్రబాబే వివేకానందరెడ్డిని చంపించాడని ఏ2 పొంతన లేకుండా ఎందుకు మాట్లాడారో తేల్చాలని బుద్దా వెంకన్న అన్నారు. సీబీఐ పులివెందులలో విచారణకు వచ్చినప్పుడల్లా, విజయసాయి ఏవో కుంటిసాకులు చెబుతూ.. ఎంపీనంటూ ఢిల్లీ పారిపోతున్నాడని విమ‌ర్శ‌లు చేశారు. వివేకానందరెడ్డి హత్యకేసు విషయాలు విజయసాయికి తెలుసునని ఆయన వైఖరి చూస్తుంటే తమకు.. ప్రజలకు అనిపిస్తోందని.. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు విజయసాయిరెడ్డిని విచారిస్తే అసలు వాస్తవాలు తేటతెల్లమవుతాయని అన్నారు. సీబీఐ బృందం పులివెందులకు వచ్చిందంటేనే విజయసాయి పల్స్ రేటు పడిపోతుందని.. ఎప్పుడు తనను పిలుస్తారా అని ఆయనకు చెమటలు పడుతుంటాయని విమ‌ర్శ‌లు గున్నించారు. అవసరమైతే ఈ వ్యవహారంపై సీబీఐకి లేఖ కూడా రాయడానికి సిధ్ధంగా ఉన్నామని అన్నారు బుద్దా వెంకన్న.


సామ్రాట్

Next Story