కాసేపట్లో పెళ్లి.. మండపం నుండి వధువు పరారీ.. తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఉండగానే

Bride escapes from the wedding hall in chitoor. కాసేపట్లో పెళ్లి.. కళ్యాణ మండపం నుండి వధువు పరారైంది. అక్కడితో ఆగిపోలేదు.. పరారైన వధువు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

By అంజి  Published on  15 Nov 2021 7:36 AM IST
కాసేపట్లో పెళ్లి.. మండపం నుండి వధువు పరారీ.. తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఉండగానే

కాసేపట్లో పెళ్లి.. కళ్యాణ మండపం నుండి వధువు పరారైంది. అక్కడితో ఆగిపోలేదు.. పరారైన వధువు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లెకు చెందిన యువతికి.. అదే ప్రాంతానికి చెందిన యువకుడితో కుటుంబ సభ్యులు, పెద్దలు పెళ్లి నిశ్చయించారు. స్థానిక కల్యాణ మండపంలో శనివారం రాత్రి విందు ఏర్పాటు చేసి వధూవరులను అక్కడే ఉంచారు. ఆదివారం తెల్లవారు జాము 5.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది.

కాగా శనివారం అర్థరాత్రి సమయంలో వధువు కల్యాణ మండపం నుంచి పారిపోయింది. ఆమె మండపం నుంచి వెళ్లిపోయిందన్న విషయాన్ని కుటుంబ సభ్యులు తెల్లవారు జామున గుర్తించారు. ఆమె అందరూ కలిసి వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వధువు తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు, బంధువులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడే ఆ యువతి తన కుటుంబ సభ్యులకు అసలైన ట్విస్ట్ ఇచ్చింది. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకుని వధువు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. బంధువుల ముందు తమకు రక్షణ కల్పించాలంటూ ఆ జంట పోలీసులను కోరింది.

యువతి మేజర్‌. కావున ఆమెకు నచ్చినట్టుగా ఉండే హక్కు ఉంటుందని పోలీసుల తెలిపారు. ఇష్టం లేని పెళ్లి చేసున్నారని నవంబర్‌ 3వ తేదీన పోలీసులకు చెప్పానని.. అప్పుడు పోలీసుల వచ్చి తన తల్లిదండ్రులతో మాట్లాడారని చెప్పింది. అయితే అప్పుడు పెళ్లి చేయమని చెప్పి.. ఆ తర్వాత నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశారని పేర్కొంది. అందుకే పెళ్లి సమయంలో అందరూ పడుకున్నాక.. మండపం నుండి బయటకు వచ్చానని, పుంగనూరులో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని వధువు తెలిపింది.

Next Story