బ్రెయిన్ డెడ్ అయిన వార్డు వాలంటీర్ అవయవదానం.. ఎనిమిది మందికి పునర్జన్మ..!
Brain Dead Ward Volunteer Organ Donation. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో
By Medi Samrat Published on 25 Feb 2022 10:47 AM ISTఅవయవదానం వల్ల ఎనిమిది మందికి పునర్జన్మ దక్కింది. వివరాళ్లోకెళితే.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. తల్లి, బంధువుల అనుమతితో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో యువకుడు అవయవాలను దానం చేశాడు. వివరాల్లోకి వెళితే.. మరీదు వెంకటరత్నం, రేవతి దంపతుల రెండో కుమారుడు కోటేశ్వరరావు(27) మచిలీపట్నంలో వార్డు వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 20న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా భీమడోలు వద్ద కారు వెనుక నుంచి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎన్నారై ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. అతను కోలుకోకపోవడంతో తల్లి రేవతి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చింది. కోటేశ్వరరావు శరీరంలోని ఆరు అవయవాలను దానం చేసి ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని అందించారు అతని కుంటుంబ సభ్యులు. ఎన్నారై ఆస్పత్రికి చెందిన 40 మంది వైద్యులు గురువారం శస్త్ర చికిత్స నిర్వహించి అవయవాలను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇందుకోసం మంగళగిరి పోలీసులతో పాటు తాడేపల్లి, కృష్ణలంక, పడమట, రామవరప్పాడు, ఆటోనగర్, ఎనికేపాడు, గన్నవరం పోలీసులు హైవేపై భారీ బందోబస్తు ఏర్పాటు చేసి గుంటూరు నుంచి గన్నవరం వెళ్లే రహదారిలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నుంచి బయలుదేరిన మూడు అంబులెన్స్‌లు 27 నిమిషాల్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడ అవయవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు విమానాల్లో చెన్నైకి తరలించారు. కోటేశ్వరరావు రెండు కిడ్నీలలో ఒకటి గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి, మరొకటి మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలోని రోగికి అందజేసినట్లు తెలుస్తోంది. రెండు కళ్లను కంటి ఆసుపత్రికి దానం చేసినట్లు సమాచారం.