బీఆర్ఏజీసీఈటీ -2025 సెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి డోలా
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరిగుతుందని, వారి నమ్మకాలను నిజం చేస్తూ విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన అందేలా చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
By Medi Samrat
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరిగుతుందని, వారి నమ్మకాలను నిజం చేస్తూ విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన అందేలా చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయంలో బీఆర్ఏజీసీఈటీ-2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు అధిక సంఖ్యలో విద్యార్థులు పోటీ పడటం హర్షనీయమన్నారు. రాష్ట్రంలో గురుకులాల స్కూళ్లు, సీట్లు పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డా. బిఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ ఏడాది ఏఫ్రిల్ 13న బిఆర్ఏజీసీఈటీ-2025ను నిర్వహించడం జరిగిందన్నారు. 5వ తరగతి లో 15,020 సీట్లు అందుబాటులో ఉండగా 39,281 మంది దరఖాస్తు చేసుకున్నారని, అంటే పోటీ నిష్పత్తి 1:2.18 అని పేర్కొన్నారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం కు 13,680 సీట్లు అందుబాటులో ఉండగా 40,792 మంది దరఖాస్తు చేసుకున్నారని, అంటే పోటీ నిష్పత్తి 1:2.39గా ఉందని మంత్రి డోలా వివరించారు.
ప్రవేశ పరీక్షలను ఆన్ లైన్ విధానం ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించామని మంత్రి డోలా తెలిపారు. 5వ తరగతి ప్రవేశ పరీక్షలో మొదటి మూడు స్థానాల్లో కర్నూల్ జిల్లాకు చెందిన కడవల సుమతి 49 మార్కులతో ప్రథమ స్థానంను, అనకాపల్లికి చెందిన వియ్యపు శరత్ 48 మార్కులతో ద్వితీయ స్థానంను, కర్నూల్ జల్లాకు చెందిన బోయా విద్యా 48 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని తెలిపారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షలో విశాఖపట్నం జిల్లాకు చెందిన రఘుపతి గీతిక 92.5 మార్కులతో మొదటి స్థానంను, కర్నూల్ జిల్లాకు చెందిన ఈపూరు సుహృతి 91.25 మార్కులు, పిజరి హసీనా 90.5 మార్కులతో రెండవ, మూడవ స్థానాలను కైవసం చేసుకున్నారని మంత్రి డోలా వివరించారు. ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు.
గురుకులాల్లో ఇకపై ప్రతి నెలా కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన పెంచేలా ఒక క్లాస్ నిర్వహించాలన్న నిర్ణయం అమలు చేయనున్నామని మంత్రి డోలా తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన కాస్మోటిక్ కిట్లను ఇకపై ప్రతి నెలా అందిస్తామన్నారు. అలాగే ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్, ట్రంక్ బాక్స్, ప్లేట్, గ్లాస్, దుప్పట్లు, కార్పెట్, టవల్, స్టేషనరీ తదితర ఏమినిటీస్ ప్రతి ఏడాది అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు అత్యవసరమైన పరిస్థితుల్లో వైద్య సదుపాయం, విషమ పరిస్థితుల్లో ఆర్ధిక సహాయం సమకూర్చడానికి రూ. 5కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని వంద పాఠశాలల్లో రూ. 10 కోట్లతో అధునాతన కిచెన్ లను అప్ గ్రేడ్ చేసి విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన భోజన వసతికి వెకనైజేషన్ ఆఫ్ కిచెన్ కు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే ప్రతి విద్యార్థికి రెండు జతల నైట్ డ్రెస్ లు అందిస్తున్నామన్నారు. అంతేకాకుండ రాష్ట్రంలో 3 ఎక్సలెన్స్ సెంటర్ లు ఉండగా వాటిని 10కి పెంచుతున్నామన్నారు. పదవ తరగతి, ఇంటర్ లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎక్సలెన్స్ సెంటర్ ల ద్వారా వారికి మరింత మెరుగైన, ఉత్తమమైన శిక్షణ అందించనున్నామన్నారు.