హరీష్ రావు రాజాకీయాల కోసం ఏదైనా మాట్లాడతాడు: బొత్స
Botsa Satyanarayana Responds to Harish Rao Comments. వైసీపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.
By Medi Samrat Published on 12 April 2023 8:37 PM IST
Botsa Satyanarayana Responds to Harish Rao Comments
వైసీపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. మా రాష్ట్రం గురించి మాకు తెలుసునని.. మీ రాష్ట్రం గురించి మీరు చూసుకోవాలని బొత్స చురకలంటించారు. హరీష్ రావు రాజాకీయాల కోసం ఏదైనా మాట్లాడతాడని.. హరీష్‌రావుకు ఏపీ గురించి మాట్లాడడానికి ఏం సంబంధం వుందని బొత్స ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడడానికి హరీష్ రావు ఎవరని, బాధ్యత గల వ్యక్తులు బాధ్యత గుర్తెరిగి మాట్లాడాలని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.
ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా హరీశ్ రావు వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. దౌర్భాగ్యపు మాటలు మానుకోవాలని, హరీశ్ రావు ఏపీకి వస్తే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తామని అన్నారు. ఒక్క వర్షం కురిసిందంటే చాలు హైదరాబాద్ మునిగిపోతుంది. హైదరాబాద్ లో ఇళ్ల మీది నుంచి నీళ్లు పోతున్నాయని.. దానికి మీరేం చేశారు? అని ప్రశ్నించారు. అన్ని సౌకర్యాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా తగలేసుకున్నారో ప్రజలు, ప్రతిపక్షాలే చెబుతున్నాయన్నారు.
హరీశ్ రావు ఎమన్నారంటే..?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో పొందాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని తొమ్మిదవ వార్డులో రూ.20 లక్షలతో చేపట్టనున్న కార్మికుల భవన నిర్మాణ పనులకు మంగళవారం రాత్రి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేడే రోజున సీఎం కేసీఆర్ నోట కార్మికులు శుభవార్త వింటారని పేర్కొన్నారు. జిల్లాలో రూ.2 కోట్లతో రెండు ఎకరాల్లో కార్మికుల భవన నిర్మాణం చేపటబోతున్నామని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. ఆంధ్ర, తెలంగాణలో పాలన చూస్తున్నారు కదా.. ఏది బాగుందో కార్మికులు చెప్పాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఆ మేరకే తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులతో పాటు అన్ని రంగాల ప్రజల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు