టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో బొజ్జల తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అధినేనత చంద్రబాబు ఇటీవలే హైదరాబాదులోని బొజ్జల నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరులో జన్మించారు. ఆయన తండ్రి గంగసుబ్బరామిరెడ్డి కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. బొజ్జల 1989లో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1994-2004 మధ్య చంద్రబాబు కేబినెట్‌లో ఐటీ మంత్రిగా, రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలిపిరి బాంబుపేలుడు ఘటనలో అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. చంద్రబాబుతో బొజ్జలకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.