మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయడంపై మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి స్పందించారు. కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని.. అక్కడ కూడా విచారణ సరిగ్గా సాగే అవకాశం లేదన్నారు. తెలంగాణలో కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు లేదని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ ఇద్దరూ వేర్వేరు కాదని ఒక్కటేనని.. ఈ కేసును తెలంగాణకు బదిలీ చేసినంత మాత్రాన కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారని.. వైఎస్ కుటుంబ సభ్యులే నిందితులుగా ఉన్న నేపథ్యంలో విచారణను సాఫీగా జరగకుండా ఆటకంకాలు సృష్టించారన్నారు. ఇకనైనా వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలని తాను కోరుకుంటున్నానన్నారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివేకా హత్య కేసుపై చంద్రబాబు వేసిన సిట్‌పై నమ్మకం లేదని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే డిమాండ్ జగన్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వైఎస్ వివేకా గుండెల్లో పోటు పొడిచి, గుండెపోటుగా మార్చారని ఆరోపించారు. పక్కా ప్లాన్ ప్రకారం వైఎస్ వివేకాను చంపి దాని నుంచి తప్పించుకునేందుకు కట్టుకథలు అల్లారని చెప్పారు.