వచ్చే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీలు బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు శనివారం ప్రకటించాయి. బీజేపీ అధినేత జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్ లు సంయుక్తంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ఒకట్రెండు రోజుల్లో సీట్ల పంపకాలపై ప్రకటన రానుంది అని ఉంది. చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ లతో ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ జరిపిన చర్చలు ఫలించాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అందుకు సంబంధించి ఓ ప్రకటనను చేశారు. ఎన్డీయే కుటుంబంలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు నడ్డా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, అద్భుత నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ముందుకెళతాయని.. మూడు పార్టీలు దేశ ప్రగతికి కట్టుబడి ఉన్నాయని అన్నారు.
మొత్తం 24 లోక్‌సభ స్థానాల్లో జనసేన, బీజేపీలకు దాదాపు ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జనసేన-బీజేపీ రెండు పార్టీలకు 28 నుంచి 32 సీట్లు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మిగిలిన అసెంబ్లీ స్థానాలలో టీడీపీ పోటీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.