వరుస అరెస్టులపై ఆగ్రహం.. పోలీసులతో మాజీమంత్రి వాగ్వాదం

Bhuma Akhila Priya Serious On Arrests Of Her Followers. టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వరుస వివాదాల్లో నిలుస్తున్నారు.

By Medi Samrat  Published on  22 Feb 2022 10:51 AM IST
వరుస అరెస్టులపై ఆగ్రహం.. పోలీసులతో మాజీమంత్రి వాగ్వాదం

టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై ఇప్పటికే ఆళ్లగడ్డలో కేసు నమోదైంది. ఆ తర్వాత అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌ తదితరులపై గ‌తంలో పలు ఘటనల్లో కేసులు నమోదయ్యాయి. తన వాచ్‌మెన్‌పై దాడి చేసి ఖాళీ స్థలంలో నిర్మించిన కాంపౌండ్‌వాల్‌ను కూల్చివేశారని అఖిల ప్రియ బంధువు భూమా కిషోర్‌రెడ్డి చేసిన‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

దీంతో ఆళ్లగడ్డ పోలీసుల తీరుపై మండిపడిన అఖిల ప్రియ.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గత మూడు రోజులుగా కారణం లేకుండా పోలీసులు తన అనుచరులను అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుతో సంబంధం లేని తన సహాయకుడు అశోక్‌ను పోలీసులు నిన్న రాత్రి తీసుకెళ్లారని.. కేసుతో సంబంధం లేకుండా తమ అనుచరులను ఎందుకు హింసిస్తున్నారని పోలీసులను మాజీ మంత్రి అఖిల ప్రియ ప్రశ్నించారు. అశోక్‌ను విడుదల చేయాలని అఖిల ప్రియ డిమాండ్ చేస్తూ పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగారు. అనంత‌రం అక్క‌డి నుండి వెళ్లిపోయారు. వారం రోజుల క్రితం భూమా నాగిరెడ్డి పేరుతో నిర్మించిన బస్ షెల్టర్ కూల్చివేత సమయంలో కాంట్రాక్టర్‌ను అడ్డుకున్న జగత్ విఖ్యాత్‌పై కేసు నమోదైంది. కాంట్రాక్టర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.



Next Story