స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్‌లను కోరారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 6:44 PM IST
స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్‌లను కోరారు. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామని సీఎం అన్నారు. 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామని...వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని సీఎం అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఎక్కవ వృద్ధి సాధించే అవకాశం ఉందని...దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలని సిఎం కోరారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని...దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతోందని అన్నారు. అగ్రికల్చర్ స్థానంలో హార్టికర్చల్ సాగు వస్తుందని...దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు హార్టికల్చర్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు.
అలాగే ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగుచేసే రైతులకు బ్యాంకులు సాయపడాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న రైతులు రుణం కోసం బ్యాంకుకు వచ్చిన 15 నిముషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి రావాలని సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే ప్రతి కుటుంబంలో రెండు మూడు పశువులు లేదా కొన్ని జీవాలు ఉంటే మంచి ఆదాయం వస్తుందని....డైరీ రంగాన్ని ప్రోత్సహించడం తమ విధానమని సీఎం అన్నారు. కొన్ని సందర్భాల్లో సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర రాక పంటలు పారబోసే పరిస్థితి వస్తోందని.. దీన్ని నివారించేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రొడక్ట్ ఫర్ ఫెక్షన్ పైనా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని..పంటలు, ఉత్పత్తులకు విలువ పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు.