బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఏపీ మంత్రి రోజాపై, ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విషయమై నోటీసులు ఇచ్చేందుకు ఇవాళ ఉదయం నుండి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద పోలీసులు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు పోలీసులను బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఎట్టకేలకు బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. నోటీసులు తీసుకోకుండా తలుపులు వేసుకొని బండారు సత్యనారాయణమూర్తి నిరసనకు దిగారు. తలుపులు తోసుకుని వెళ్లి మంత్రికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఇక బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందన్నారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు సరైన గౌరవం దక్కాలని అభిప్రాయపడ్డారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. టీడీపీ నేతలు సంస్కారం లేకుండా, మహిళలను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు రోజా.