ఎప్పుడు.. ఎవరిలో.. ఎలాంటి మార్పు వస్తుందో అసలు ఊహించలేము..! ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ వ్యక్తి సన్యాసం స్వీకరించాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయన సన్యాసిగా మారిపోయారు. సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వాళ్లు రాజకీయ సన్యాసం తీసుకుంటామని తెలిపేవారు. కానీ ఈయన మాత్రం ఏకంగా సన్యాసిగా అవతారం ఎత్తారు.

బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ శివరామకృష్ణారావు రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు. ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు. డాక్టర్‌ వడ్డెమాను శివరామకృష్ణారావు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. అట్లూరు మండలం కమలకూరు స్వగ్రామం. 1972లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బిజివేముల వీరారెడ్డిపై తొలుత ఓటమి చెందారు. 1977లో బద్వేలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో ఓటమి చెందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 1994, 1999, 2001 ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా ఈయన క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారు.

శివరామకృష్ణారావు తండ్రి వడ్డెమాను చిదానందం 1952లో తొలి జనరల్‌ ఎలక్షన్లలో బద్వేలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955లో మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆయన 1962లో బద్వేలు నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి మరోమారు శాసనసభ్యునిగా ఎన్నిక అయ్యారు. బ్రహ్మణ సామాజికవర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శివరామకృష్ణారావు ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

2015 నుంచి ఆధ్యాత్మిక చింతనవైపు మొగ్గుచూపిన శివరామకృష్ణారావు రిషికేశ్‌కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికం తీసుకున్నారు. ఇక పూర్తి ఆధ్యాత్మిక జీవితంవైపు ఆకర్షితులైన ఆయన ఎట్టకేలకు సన్యాస దీక్ష తీసుకోవాలని నిర్ణయించారు. గురువారం రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద గురువు శ్రీ సద్గురు తత్వ విదానందసరస్వతీ ఆధ్వర్యంలో దీక్ష తీసుకున్నారు.


సామ్రాట్

Next Story