కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరగగా.. వైసీపీ ఆధిక్యంలో ఉంది. బద్వేలు ఉప ఎన్నికలో 259 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వీటిని రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో లెక్కించారు. మొదటి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో వైసీపీకి 10,478, బీజేపీకి 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. నాలుగో రౌండ్ ముగిసే సరికి వైసీపీ 30,412 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. బద్వేలులో వైసీపీ అభ్యర్థి సుధ, బీజేపీ అభ్యర్థి సురేష్ మధ్య పోటీ నెలకొంది.
పట్టణంలోని ప్రభుత్వ స్కూల్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా, భారీ బందోబస్తు మధ్య ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం నాలుగు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటు చేయగా.. ప్రతి కేంద్రంలో ఆర్వో, ఏఆర్వోలకు ఒక టేబుల్‌ను ఏర్పాటు చేశారు. మొత్తంగా 12 రౌండ్లతో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తే ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా మరో 27 ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఖండ్వా, మండి, దాద్రానగర్ హవేలీ లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.