పరామర్శకు వెళ్ళి.. యుద్ధంలో గెలిచినట్టు లోకేష్ చేష్టలేంటి..?

Avanthi Srinivas Fires On Nara Lokesh. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి

By Medi Samrat  Published on  17 Aug 2021 1:33 PM GMT
పరామర్శకు వెళ్ళి.. యుద్ధంలో గెలిచినట్టు లోకేష్ చేష్టలేంటి..?

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థినిని ఈ విధంగా హత్య చేయడం చాలా బాధాకరం అని విచారం వ్య‌క్తం చేశారు. సోషల్ మీడియా ద్వారాగానీ, ప్రత్యక్షంగా కానీ మహిళలు, యువతులపై ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే.. పోలీసులకు ఫిర్యాదు చేయండని.. లేకపోతే దిశ యాప్ ద్వారా కంప్లైంట్ చేయండని సూచించారు. దిశ యాప్ ను ప్రతి ఒక్క మహిళ, యువతి డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు.

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే.. ఈ ప్రభుత్వం ఏ కులమైనా, మతమైనా, ఎవర్నీ ఉపేక్షించదని స్ప‌ష్టం చేశారు. పక్క రాష్ట్రంలో ఓ మెడికోపై అఘాయిత్యం జరిగితే.. సీఎం జగన్ స్పందించి.. అసెంబ్లీలో దిశ బిల్లు చేసి, చట్టం కోసం కేంద్రానికి పంపించామ‌ని.. అది చట్టమైతే ఇటువంటి ప్రేమోన్మాదులకు, అల్లరిమూకలకు మరింత వేగంగా శిక్షలు పడతాయని అన్నారు. రమ్య హత్య కేసులో.. ఏపీ పోలీసులు కూడా 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్టు చేశారని తెలిపారు.

రాష్ట్రంలో పనిలేని ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉందని మండిప‌డ్డారు. చంద్రబాబు కుమారుడుగా తప్పితే.. ఏ అర్హతా లేని లోకేష్ ఈ మధ్య వెయిట్ తో పాటు విచక్షణ కూడా కోల్పోయి ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. రమ్యను కోల్పోయి వారి కుటుంబం బాధలో ఉంటే.. ఓదార్చాల్సిందిపోయి, గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళకుండా అడ్డుకోవడం, పోలీసులపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం బాధాకరమ‌ని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ని వ్యక్తిగతంగా దూషించినంత మాత్రాన జీరోగా ఉన్న లోకేష్ ఎప్పటికీ హీరో కాలేడు అన్నది గుర్తుంచుకోవాలని అన్నారు.

ప్రజల మన్ననలు, సంపూర్ణ విశ్వాసంతో ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని.. నాయకుడు అంటే జగన్ లా ఆదర్శంగా ఉండాలి తప్పితే.. చిల్లర రాజకీయాలు చేయకూడదని చెప్పారు. లోకేష్ గ్రామ స్థాయి నాయకుడి కంటే హీనంగా మాట్లాడుతున్నాడని.. అమెరికాలో చదివిన లోకేష్.. ఇటువంటి భాషను మాట్లాడటం ఎంతవరకు సబబో తనకు తానే ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రిని ప్రస్తావిస్తూ.. వ్యక్తిగతంగా దూషణలు చేయడం లోకేష్ మానుకోవాలని సూచించారు. యుద్ధంలో జయించిన హీరో మాదిరిగా నిన్న రమ్య కుటుంబ సభ్యుల పరామర్శకు వెళ్ళిన లోకేష్.. నుదుటున పెద్ద బొట్టుపెట్టుకుని.. కారు దగ్గర పిడికిలి బిగించి చూపిస్తూ సంకేతాలు ఇస్తూ.. పోలీసులపై దౌర్జన్యం చేస్తూ.. నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటి..? అని ప్ర‌శ్నించారు. లోకేష్ చేష్టలు పెళ్ళికి, చావుకీ ఒకే మంత్రం అన్నట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.


Next Story