పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుపై కొందరు వ్యక్తులు రాళ్లు, మేకులతో దాడికి యత్నించారు. ఆకివీడులోని స్థానిక రామాలయ స్థలానికి సంబంధించి గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని స్థానికుల ఆహ్వానం మేరకు రఘురామరాజు ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఒక వర్గానికి చెందిన వారు నినాదాలు చేస్తూ రాళ్ల దాడికి దిగారు. దాడి సమయంలో రఘురామరాజుకు రక్షణగా నిలిచిన వారిపై నిందితులు దాడి చేశారు. ఈ పెనుగులాటలో పలువురు కూటమి నాయకులకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు రఘురామరాజును సురక్షితంగా అక్కడి నుండి తరలించారు. ఘటన అనంతరం ఆకివీడులో అదనపు బలగాలను మోహరించారు.