ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థిని లహరిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో యువకుడికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కోపంతో యువతిపై యువకుడు దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో మాట్లాడి కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వెల్దుర్తి మండలం సామర్లకోటకు చెందిన విద్యార్థిని, కలుగొట్లకు చెందిన యువకుడు ఇంటర్ చదువుతున్నాడు. యువకుడు కొంత కాలంగా లవ్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలికను ఆమె తల్లిదండ్రులు నందికొట్కూరులోని అమ్మమ్మ ఇంటికి పంపారు. 6 నెలల కిందట బాలుడు అక్కడికి వెళ్లాడు. దీంతో ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఇంటికి రానివ్వొద్దని వారు సూచించారు.
ఆదివారం నాడు అర్ధరాత్రి బాలుడు.. బాలిక అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలిక గట్టిగా కేకలు పెడుతూ అక్కడికక్కడే మృతి చెందింది. యువకుడికి కూడా మంటలు అంటుకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.