ఏపీలో మూడు రాజధానుల విషయంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దమ్ముంటే రాజీనామా చేయాలని నేతలు సవాళ్లు విసురుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామాలు చేస్తామని వైసీపీ నేతలు.. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు.. రాజీనామాల ఎపిసోడ్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో మూడు రాజధానులు, అమరావతి రైతుల మహా పాదయాత్రపై వైఎస్సార్‌సీపీ నేతల వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. వైసీపీ నేతలు ఉత్తర కోస్తా ఆంధ్రాను కబళించేందుకు వస్తున్నారని.. ఉత్తర కోస్తా ఆంధ్రాలో 40 వేల ఎకరాలు దోచుకున్నారని, విశాఖలో భూకబ్జాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరిపాలన రాజధాని పేరుతో విశాఖను దోచుకోవడానికి వైసీపీ నేతలు వికేంద్రీకరణ అంశాలను లేవనెత్తుతున్నారని, నాన్ పొలిటికల్ జేఏసీలో ఉన్నవారు అధికార వైసీపీకి చెందిన వారేనని ఆరోపించారు.
ఇటీవల విశాఖలో జరిగిన నాన్ పొలిటికల్ జేఏసీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు.. మూడు రాజధానుల ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమని టీడీపీకి సవాల్ విసిరారు. మూడు రాజధానులకు మద్దతుగా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుని జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. అచ్చెన్నాయుడు రాజీనామా చేసి టెక్కలి నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సవాల్ విసిరారు.