ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో స్థానంలో ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచేందుకు టీడీపీ ఆధ్వర్యంలో 'రైతు కోసం తెలుగు దేశం' పేరుతో కమిటీని ఏర్పాటు చేసినట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాల్లో కమిటీ పర్యటించి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. కమిటీలో సభ్యులుగా టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, కూన రవికుమార్, తెలుగు రైతు అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డిలను నియమించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.