అచ్చెన్నాయుడు కుటుంబంలో ఊహించని విషాదం
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది.
By Medi Samrat Published on 31 March 2024 9:02 PM ISTఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ కన్నుమూశారు. ఆదివారం నాడు ఆమె కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని స్వగృహంలో తుదిశ్వాశ విడిచారు. 90 ఏళ్ల కళావతమ్మ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. అచ్చెన్నాయుడు నాన్న దాలినాయుడు సుమారు15 ఏళ్ల కిందట కన్నుమూశారు.
అచ్చెన్నాయుడు తల్లి మరణంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. కళావతమ్మ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నట్టు వెల్లడించారు. అమ్మగారి మరణం కింజరాపు కుటుంబానికి తీరని లోటు అని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని.. కళావతమ్మకు కన్నీటి నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని నారా లోకేశ్ తెలిపారు. కింజరపు దాలినాయుడు, కళావతమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు కన్నుమూశారు. రెండో కొడుకు హరివరప్రసాద్ కోటబొమ్మాళిలో పీఏసీఎస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మూడో కొడుకు ప్రభాకర్ పోలీస్ శాఖలో డీఎస్పీగా ఉన్నారు. అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారు.