విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బొడికొండపై ఉద్రిక్తత నెలకొంది. కోదండ రామాలయం నిర్మాణానికి చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులకు, అశోక్ గజపతి రాజు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలితో శంకు స్థాపన విషయమై చర్చించకపోవడం పట్ల అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి పూజలు నిర్వహించడంపై గజపతి రాజు అసహనం వ్యక్తం చేశారు. పూర్వం నుండి ఆలయ నిర్మాణ కార్యక్రమాలను రాజవంశీయులే చేస్తున్నారని, దానికి విరుద్ధంగా మంత్రులతో నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించడపై అశోక్ ఆగ్రహించారు.
ఆలయం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గజపతి రాజు ఆందోళనకు దిగారు. రామతీర్థం ఆలయ కమిటీ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు ఉన్నారు. శంకుస్థాపన బోర్డును తొలగించేందుకు అశోక్ గజపతి ప్రయత్నించగా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే కొండపై అశోక్ గజపతి రాజు, ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్వామి వారికి పూజలు చేసిన అనంతరం అశోక్ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సంవత్సరం రామతీర్థంలోని కోదండరాముడి విగ్రహ శిరస్సును ధ్వంసం చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.