మాన్సాస్ ఛైర్మన్‌గా కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరిస్తూ అశోక్ గజపతిరాజు గురువారం సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాన్సాస్‌లో దోపిడీదారులకు స్థానం లేదన్నారు. ఛైర్మన్‌గా తాను విద్యకే తొలి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై దృష్టి సారిస్తామని తెలిపారు. అలాగే.. మాన్సాస్‌లో ఆడిట్ జరగలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయానని.. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని అన్నారు. ఆడిట్ కోసం ప్రతి ఏడాది సంస్థ ఫీజు కూడా అధికారికంగా చెల్లించిందని తెలిపారు.
రామతీర్థం విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదన్నారు. హిందూ మతంపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు దాడులు చేస్తోందని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. దుండగుల దాడిలో రాముని శిరస్సు ఖండించిన వారిని పట్టుకోకపోగా.. ఆలయ బాగు కోసం విరాళం ఇచ్చినా తిరస్కరించటం తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. దేశంలో ఇంకా హిందూ మతం బతికుండటంతో ఆ విరాళం అయోధ్యలో సమర్పించామన్నారు.